గుంటూరు జిల్లా, తాడేపల్లి పరిధి శివలింగాల కట్ట వద్ద ఆదివారం ఘోరం జరిగింది. పటమట ఫన్‌టైమ్స్ రోడ్డు ప్రాంతానికి చెందిన పతివాడ బాలాజీ(19), స్కూ బ్రిడ్జి ప్రాంతానికి చెందిన పెసర్లంక సాయితేజ(19), గండిరెడ్డి రాజు, మద్ది రాజేష్, ఉమ్మిశెట్టి రోహిత్, గండ్రె దుర్గప్రసాద్, బొప్పన గౌతమ్ ఒకే ప్రాంతానికి చెందిన స్నేహితులు. బాలాజీ పాలిటెక్నిక్ కోర్సు, రాజు, రాజేష్ ఉషారామ కళాశాలలో ఇంజనీరింగ్, దుర్గాప్రసాద్ రమేష్ ఆసుపత్రి సమీపంలో ఐటీఐ, గౌతమ్ బీకాం చదువుతున్నారు. సాయితేజ ఫొటోగ్రాఫర్‌గా, రోహిత్ ప్రైవేటు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరంతా సరదాగా నదిలో ఈత కొడదామని మధ్యాహ్నం రెండున్నరకు గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి శివలింగాల కట్ట వద్దకు చేరుకొన్నారు. నాలుగున్నర సమయంలో మిగిలిన వాళ్లు ఫొటోలు దిగుతుండగా బాలాజీ, సాయితేజ ఈతకని నదిలోకి దిగి గల్లంతయ్యారు. మిగిలిన ఐదుగురు ఫోన్లలో బంధువులకు, స్నేహితులకు సమాచారం పంపారు. పెనమలూరు పోలీసులు నది వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. వెతికిన కాసేపటికే బాలాజీ, సాయితేజ మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు.