కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కోర్టు సమన్లు జారీ అయ్యాయి. పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. హిందూ సురక్షా పరిషత్ భజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు, సంగ్రూర్ వాసి అయిన హితేష్ భరద్వాజ్ ఖర్గేకి వ్యతిరేకంగా రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా భజరంగ్ దళ్ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలను ఖర్గే చేసినట్టు ఆరోపణ.
జాతి వ్యతిరేక సంస్థలతో సమానంగా భజరంగ్ దళ్ ను కాంగ్రెస్ పార్టీ పోల్చినట్టు హితేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని చేసిన ప్రకటనను కూడా ప్రస్తావించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పదో పేజీలో భజరంగ్ దళ్ ను జాతి వ్యతిరేక సంస్థలతో పోల్చారు. తాము ఎన్నికల్లో గెలిస్తే నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చారు’’ అని హితేష్ భరద్వాజ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.