లండన్ ప్లాన్ బహిర్గతమైందని, తన చివరి రక్తపు బొట్టు వరకు వంచకులకు వ్యతిరేకంగా పోరాడుతానని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. దేశద్రోహ నేరం కింద పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని పాకిస్తాన్ ఆర్మీ యోచిస్తోందని ఆయన ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు హింసను సాకుగా చూపి, వారు న్యాయమూర్తి, జ్యూరీ, ఎగ్జిక్యూషనర్ పాత్రలను పోషించారన్నారు. తన భార్య బుష్రాని జైలులో పెట్టడం ద్వారా తనను అవమానపరిచే ప్రయత్నం చేశారన్నారు. పదేళ్లపాటు తనను జైలు లోపల ఉంచేందుకు కొన్ని దేశద్రోహ చట్టాలను ప్రయోగించే ప్లాన్ ఉందన్నారు.
తనకు మద్దతుగా నిరసనలు తెలిపే వారిని అణచివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. తమ పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు మీడియాను నియంత్రిస్తున్నారన్నారు. ఎందుకంటే రేపు తనను మళ్లీ అరెస్ట్ చేసినప్పుడు వారు బయటకు రాకూడదని భావిస్తున్నారన్నారు. అవసరమైతే ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారన్నారు. అయితే, తన చివరి రక్తపు బొట్టు వరకు స్వేచ్ఛ కోసం పోరాడుతానన్నారు.