అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. లైన్‌మైన్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తి లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టాడు. నెలకు అద్దెల రూపంలోనే అతడికి రూ. 4 లక్షల ఆదాయం వస్తుందంటే ఎంతగా అవినీతి చేశాడో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్తు శాఖ డీఈఈగా పని చేస్తున్న సన్ని రాంబాబు ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులు సైతం నెవ్వరపోయారు. అతడు విశాఖ వ్యాప్తంగా రూ. కోట్ల విలువైన భవనాలు, ఖాళీ స్థలాలు కొనుగోలు చేశాడు. వివరాల్లోకి వెళితే.. విశాఖ పరవాడ ఫార్మాసిటీలో ఉన్న ఏపీఈపీడీసీఎల్ అనకాపల్లి సబ్ డివిజన్ ఎంఆర్‌టీ-సిటీ మీటర్స్ కార్యాలయం రాంబాబు డీఈఈగా విధులు నిర్వహిస్తున్నాడు. పాతగాజువాక మెహర్‌నగర్‌లో అతడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
అయితే అతడు ఆదాయనికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు ఏసీబీ అదనపు ఎస్పీ శ్రావణి నేతృత్వంలో సిబ్బంది అతడి నివాసంలో, ఆఫీస్‌లో తనిఖీ చేపట్టారు. రాంబాబు ఇంట్లో ఉన్న బీరువాల్లో ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు, బీమాబాండ్లు, నగదు లావాదేవీలకు చెందిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. వీటిల్లో గాజువాక అపార్ట్‌మెంట్ విలువ బహిరంగ సుమారు రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని తెలిసింది.
ఇక రాంబాబు ఉంటున్న మూడంతస్తుల బిల్డింగ్ విలువ రూ.2 నుంచి 3 కోట్లుపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మల్కాపురంలోని రెండు భవనాల విలువ రూ.3 కోట్లు. శివాజీపాలెంలో ఓపెన్ ఫ్లాట్ విలువ రూ.70 లక్షలు. భోగాపురంలో స్థలం విలువ రూ.కోటిపైనే. కేవలం ఇళ్ల అద్దెల ద్వారా రాంబాబు ప్రతినెలా రూ.4 లక్షలు ఆర్జిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాల్లో దొరికిన బంగారం, వెండి ఆభరణాల విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సన్ని రాంబాబు విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో మొదట లైన్‌మెన్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ప్రమోషన్‌పై 2016 అక్టోబర్‌లో పెదగంట్యాడలో ఏఈగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లపాటు అక్కడ పనిచేశారు. అనంతరం మల్కాపురం డివిజన్ ఏడీఈగా 2019 నవంబరులో బాధ్యతలు చేపట్టి 2022 జులై వరకు విధులు నిర్వహించారు. ప్రస్తుతం అనకాపల్లి కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా కొనసాగుతున్నారు. రాంబాబు భార్య పెదగంట్యాడలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అవినీతి అధికారి రాంబాబుపై కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పట్టుబడిన ఆస్తులు, నగదు, బంగారాన్ని జప్తు చేశారు.