కృష్టా జిల్లా మచిలీపట్నంలో సోమవారం పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. పోర్టు నిర్మాణ ప్రదేశంలో.. భూమి పూజ చేసి, అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బందరు పోర్టు నిర్మాణం గురించి.. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 'వైఎస్‌ఆర్ మరణంతో బందరు పోర్టు నిర్మాణం ఆగిపోయింది. బందరు పోర్టు ప్రజల ఆస్తి. పోర్టు నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేయలేదు. వందకు వంద శాతం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగబోతోంది. బందరు పోర్టు నిర్మాణంతో జిల్లా ముఖచిత్రం మారబోతోంది. ఇది కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. దాన్ని ముఖ్యమంత్రి జగన్ సాకారం చేస్తున్నారు' అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
బందరు పోర్టు నిర్మాణానికి మొత్తం 5 వేల 253.88 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో 75 శాతం బ్యాంకు రుణం తీసుకోవాలని.. మిగతా 25 శాతం ప్రభుత్వం ఖర్చు చేయాలని అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రుణం తీసుకునే అంశంపై ఏపీ కేబినెట్‌లో కూడా చర్చించారు. రుణం తీసుకునేందుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనుల ప్రారంభానికి అధికారులు చర్యలు చేపట్టారు.