మచిలీపట్నం పోర్టు పనుల ప్రారంభోత్సవం కాబోతున్న తరుణంలో తనకు మాటల్లేని ఆనందం కలుగుతోందని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బందరు పోర్టు కోసం 19 సంవత్సరాల నుంచి ప్రభుత్వాల వెంటపడ్డామని చెప్పారు. పోర్టు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఎన్నటికీ పూర్తి కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భావించారని పేర్కొన్నారు. అందుకే బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
ఈ మేరకు ఆదివారం మచిలీపట్నం పోర్టు వద్ద మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో బందరు పోర్టు నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఈ భూమి ఉన్నంత వరకు బందరు పోర్టు ప్రజలు ఆస్తి అని అన్నారు. పోర్టు నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేయలేదన్నారు. వందకు వంద శాతం 1,700 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగుతోందన్నారు. బందరు పోర్టు నిర్మాణంతో జిల్లా ముఖచిత్రం మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
నిన్నటి వరకు కలగా ఉన్న బందరు పోర్టు నిర్మాణం ఈరోజు సాక్షాత్కారం కానుందని పేర్ని నాని అన్నారు. వంద శాతం ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తండ్రి వైఎస్సార్ సంకల్పాన్ని తనయుడు వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు. పోర్టు నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. గతంలో అనేక సార్లు బందరు రావాలని సీఎం జగన్‌ను కోరానని గుర్తు చేశారు. అయితే, గత ప్రభుత్వం లాగా మనం మోసం చేయవద్దని సీఎం జగన్ తెలిపారన్నారు. పోర్టు పనుల ప్రారంభోత్సవానికే బందరు వస్తానని స్పష్టంగా చెప్పారన్నారు.
ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీ నాయకులపై పేర్ని నాని సెటైర్లు వేశారు. సెల్ఫీ డ్రామాలాడే కమల్‌హాసన్, గుమ్మడి, రేలంగిలను చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన ముఠా.. ఏనాడైనా బందరులో పోర్ట్, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ కట్టాలని ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. మాటలు చెప్పేవారికి .. పనులు చేసే వారికి ఇదే తేడా అని ఎమోషనల్ అయ్యారు.
ఇదిలావుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బందరు పోర్టుకు సోమవారం (మే 22న) శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం సీఎం జగన్ మచిలీపట్నం పర్యటనలో భాగంగా ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి హెలీకాఫ్టర్‌లో 9 గంటలకు బందరు మండలం తపసిపూడికి చేరుకుంటారు. 9.20 గంటలకు పోర్టు పనుల ప్రారంభ పూజలు చేస్తారు. 9.45కు పోర్టు పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.