తరుచూ ప్రమాదాలకు కారణమవుతోన్న మిగ్-21 విమానాల విషయంలో భారత వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్దనున్న మిగ్–21 విమానాల సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. మే 8న రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో మిగ్ విమానం కూలి ముగ్గురు పౌరులు ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం విమానాలను పరిశీలించి, వాటి లోపాలపై పూర్తిగా దర్యాప్తునకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఐదు దశాబ్దాలుగా భారత వాయుసేనకు మిగ్ విమానాలు సేవలు అందిస్తున్నాయి. పాతకాలం నాటి మిగ్‌లను ఇప్పటికే పక్కనబెట్టాల్సి ఉండగా.. కొత్త విమానాల కొరత వల్ల వాటిని కొనసాగిస్తోంది. ప్రస్తుతం సేవలు అందిస్తోన్న మూడు మిగ్–21 స్క్వాడ్రన్లు.. 2025 నాటికి దశలవారీగా తప్పించే యోచనలో రక్షణ శాఖ ఉంది.
భారత వాయుసేనలో మిగ్ బైసన్ విమానాల్లోనే అత్యధిక ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకోవడంతో వీటిని ‘ఎగిరే శవపేటిక’లుగా పిలుస్తున్నారు. 1960 వ దశకంలో ఐఏఎఫ్‌లోకి చేరిన ఈ విమానాల్లో 400 మిగ్‌లు కుప్పకూలడం గమనార్హం. ఈ ప్రమాదాల్లో దాదాపు 200మందికిపైగా పైలట్లు, 60మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గత ఐదేళ్లలోనే 50కిపైగా విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. గత కొన్నేళ్లుగా మిగ్-21తో పాటు ఛీతా, చేతక్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు కూలిపోవడం కలవరానికి గురిచేస్తున్నాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్వాభావిక భద్రతా ప్రమాణాలు లేని ఈ పాతతరం విమానాలు, హెలికాప్టర్లుకు డిమాండ్ ఎక్కువే. అయితే, పైలట్‌లతో పాటు సాంకేతిక నిపుణులకు తగిన శిక్షణ, పర్యవేక్షణ లేకపోవడం, పేలవమైన మెయింటెనెన్స్, ఓవర్‌హాల్ పద్ధతులు, విడిభాగాలపై ఆమోదయోగ్యం కాని నాణ్యత నియంత్రణ లేకపోవడం వంటివి ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
‘మానవ తప్పిదాలు (పైలట్‌లు/ సాంకేతిక సిబ్బంది), సాంకేతిక లోపాలు దాదాపు 90 శాతం కూలిపోవడానికి కారణమని, పక్షి దాడులు, ఇతర సమస్యలు మిగిలిన 10 శాతానికి కారణమని పలు నివేదికలు పేర్కొన్నాయి. జవాబుదారీతనం, దిద్దుబాటు, కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు మరింత పటిష్టమైన తనిఖీలు, బ్యాలెన్స్‌ల వ్యవస్థ అవసరమని నిపుణులు అంటున్నారు.