ముఖ్యమంత్రి పదవిపై ఎడగతెగని చర్చ అనంతరం శనివారం కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 24 వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌లు ప్రమాణస్వీకారం చేశారు. వారితో పాటు తొలి విడతగా క్యాబినెట్‌లోకి 8 మందిని తీసుకున్నారు. ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు ప్రధాన హామీలను నెరవేర్చేందుకు క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రజాభీష్టం మేరకు పాలన సాగిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఎన్నికల హామీల అమలు దిశగా ముందుకెళ్లడం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై తొలి క్యాబినెట్‌లోనే నిర్ణయం తీసుకుని, అమలుచేస్తామని ఫలితాలు వెలువడిన రోజే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే తొలి క్యాబినెట్‌లో కీలకమైన ఐదు గ్యారంటీలకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గృహజ్యోతి, గృహ లక్ష్మి, అన్నభాగ్య, యువనిధి, శక్తి పథకం ఈ ఐదు హామీలపై నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఈ ఐదు హామీల అమలుకు ఏటా రూ.50 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
ఈ ఐదు హామీలతోపాటు మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి ఒక్క హామీనీ రాబోయే ఐదేళ్లలో అమలకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రజల ఆశీస్సుల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ విజయం అగ్రనేత రాహుల్ గాంధీకే చెల్లుతుందని, రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర చేపట్టినప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినట్లయిందని అన్నారు. ప్రచారంలో భాగస్వాములైన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘గతంలో మేం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాం.. భవిష్యత్‌లోనూ అదే కొనసాగిస్తాం’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పేదలు, దళితులు, అణగారిన వర్గాలు ఆదరించడం వల్లే అధికారంలోకి వచ్చామని చెప్పారు. ద్వేషంపై ప్రేమ సాధించని విజయమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చుతాయని అన్నారు.