శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ఆదివారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయాన్ని అడగ్గానే మీడియాపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుందని.. ఈ విషయంలో నీకు నాకు పనేంటని ప్రశ్నించారు. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉంటే.. సీబీఐ తేలుస్తుందని.. ఈ విషయం నీకు చెప్పాలా? నువ్వేమైనా సీబీఐ చీఫ్‌వా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి విషయాలు అడగాలో అడగకూడదో కాస్త తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి పూట గడవడం కోసం ఏదో ఒకటి మాట్లాడుతోందని స్పీకత్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి గోల చేస్తున్నారని.. తాను సభ్యుల విధి విధానాలు చెపితే తప్ప వారి బాధ్యతలు తెలియదా అని ప్రశ్నించారు. ఏవైనా ప్రభుత్వం తప్పులుంటే అసెంబ్లీకి రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి అని హితవుపలికారు.
మరోవైపు.. లోకేష్‌కి సరిగా మాట్లాడటం కూడా రాదని స్పీకర్ తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. శనివారం కూడా లోకేష్ ఉత్సహంలో 2019 ఫలితాలే పునరావృతం అవుతాయని అన్నారని పేర్కొన్నారు. ఏపీలో నిజంగానే అదే జరుగితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తున్న వ్యక్తిగా చెబుతున్నా.. 2024లో మళ్లీ పూర్తి మెజారిటీతో 175 స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజురోజుకూ సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ వరుసగా నోటీసులు జారీ చేస్తోంది. అయితే, ఆయన సీబీఐ ముందు హాజరుకాకుండా.. ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వాళ్ల అమ్మ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి సీబీఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది.