ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండొద్దని చెప్పారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
ద్రోణి ప్రభావంతో.. సోమవారం శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇక వడగాల్పులపైనా అధికారులు కీలక సూచనలు చేశారు. మన్యం జిల్లాలోని కొమరాడ, పార్వతీపురం మండలాల్లో, వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, వీరపనాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలాల్లో, విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలంలో సోమవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం.. కడప జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలో ఒక మండలంలో వడగల్పులు వీచాయని వెల్లడించారు.