వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని టీడీపీ నాయకులు జీవి ఆంజనేయులు, ప్రతిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మలపాటి శ్రీధర్, వైవి ఆంజనేయులు, చదలవాడ అరవింద బాబు, జూలకంటి బ్రహ్మ రెడ్డి, కోడెల శివరాం పిలుపునిచ్చారు. సోమవారం నరసరావుపేటలోని జమిందార్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు, పల్నాడు జిల్లా మినీ మహానాడుకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీ. వి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం కార్యకర్తలదేనన్నారు. మొన్న జరిగిన యువగళం సంఘీభావ పాదయాత్రతో నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు, వైఎస్ జగన్ వెన్నులో వణుకు మొదలైందన్నారు. ప్రజలు టీడీపీని కోరుకుంటున్నారన్న అందుకు చంద్రబాబు, లోకేష్‌ల పర్యటనల్లో లభిస్తున్న ఆదరణ నిదర్శనమన్నారు. గ్రామ కమిటీలే సుప్రీం అని, అన్ని కులాలను కలుపుకొని ప్రతి ఒక్కరూ కష్టడి పని చేయాలన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ అరాచకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. తమ్ముడు అవినాష్‌రెడ్డిని కాపాడుకునేందుకు జగన్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటక సినిమా అయిపోయిందని. త్వరలోనే బాబాయి, అబ్బాయి సినిమా కూడా అయిపోతుందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఉమ్మారెడ్డికి కేంద్రమంత్రి పదవులు, అజయ్ కల్లాంకు చీఫ్ సెక్రటరీ పోస్టులు ఇస్తే నేడు వాళ్లని సీబీఐకి అప్పగించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు రాగానే జగన్‌రెడ్డికి అంకుశం సినిమా చూపిస్తామని తెలిపారు. దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్ రాజకీయ అరాచకత్వం ఎలా చేయాలో చూపాడని, అవన్నీ తిరిగి అతనికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.