మునగపాక: చంద్రశేఖర్ మహాస్వామి పిరమిడ్ ధ్యాన అమృత ఐదవ వార్షిక సంబరాలు ఘనంగా నిర్వహించారు. మండలంలో నాగులాపల్లి గ్రామంలో సోమవారం పీలా. సుజాత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన అమృత ఐదవ వార్షిక సంబరాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ పిరమిడ్ ధ్యాన కేంద్రాల ద్వారా ధ్యానాన్ని చేయడం అభ్యసించి మానసిక ప్రశాంతతను పొందవచ్చని అన్నారు. మనసు ప్రశాంతంగా ఉంటే ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాకుండా నిత్యజీవితంలో ఎంతో అభివృద్ధిని సాధించవచ్చని సరైన నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చు అన్నారు. విద్యార్థులు ఇప్పుడు వేసవి సెలవుల్లో ఇటువంటి ధ్యాన శిక్షణా కేంద్రాల్లో చేరడం ద్వారా వారిలో చదువు పట్ల ఆసక్తి, శ్రద్ధ, అంకితభావం కలుగుతాయని అన్నారు. రోజు ధ్యానం చేయడం వల్ల శరీరం కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ప్రకాశవంతంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాండ్రేగుల విష్ణుమూర్తి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ త్రినాథ్, ఆర్ట్ పిక్చర్ భాస్కరరావు, పెంటకోట వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.