పెద్ద నోట్ల రద్దు తరహా పరిస్థితులు తాజాగా రూ.2000 నోట్ల మార్పిడి విషయంలో చోటు చేసుకుంటుంది. రూ.2,000 నోట్ల మార్పిడిపై బ్యాంకర్లలో అస్పష్టత నెలకొంది. రూ.2,000 నోట్లను సెప్టెంబర్ 30 వరకు మార్చుకునేందుకు ఆర్ బీఐ గడువు ఇచ్చింది. కానీ, నోట్లను మార్చే విషయంలో బ్యాంకులు ప్రస్తుత నిబంధనలను అనుసరించాలని ఆర్ బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. ఎస్ బీఐ, పీఎన్ బీ ఇప్పటికే నోట్ల మార్పిడిపై ప్రకటనలు విడుదల చేశాయి. నోట్లను మార్చుకునే వారు ఎలాంటి దరఖాస్తులు, ఐండెంటిటీ పత్రాలు ఇవ్వక్కర్లేదని పేర్కొన్నాయి.
కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంతర్గత ఆదేశాల ప్రకారం కరెన్సీ నోట్ల మార్పిడి సమయంలో గుర్తింపు పత్రాన్ని అడగొచ్చని పేర్కొన్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా డిపాజిట్లు తీసుకుంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు బ్యాంకర్లు భావిస్తున్నారు. ఎవరు మార్చుకుంటున్నారు? ఎన్ని సార్లు మార్చుకుంటున్నారనే విషయంలో ఎలాంటి పత్రాలు లేకపోతే.. సదరు వ్యక్తి తర్వాత మనీలాండరింగ్ కేసులో పట్టుబడితే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాంటి కేసుల్లో దర్యాప్తు అధికారులు బ్యాంకు అధికారులను వేధింపులకు గురి చేస్తారని అనుమానిస్తున్నారు.
రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో తాము ఎలాంటి అదనపు ప్రొసీజర్ ను ప్రకటించలేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను అనుసరించాల్సి ఉంటుందని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సైతం స్పష్టం చేశారు. ‘‘ఆదాయపన్ను శాఖ నిబంధన కింద రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ ను సమర్పించాలి. కనుక ప్రస్తుత నిబంధనలు కొనసాగుతాయి’’ అని దాస్ చెప్పారు. కనుక రూ.50,000కు మించి రూ.2,000 నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేసే వారు పాన్ జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు కేవైసీ డాక్యుమెంట్లు అవసరం లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాలం పేర్కొన్నారు.