ప్రధాని నరేంద్ర మోడీకి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. గర్వంతో, సంతోషంతో ఉప్పొంగిపోతున్న దేశ ప్రజలతో కలిసి తాను కూడా ప్రధానిని అభినందిస్తున్నానని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి, ఈ చారిత్రక పార్లమెంటు భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుకుంటున్నానని వివరించారు. మార్పు దిశగా తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు ఈ కొత్త పార్లమెంటు భవనం వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో ఉన్నవాళ్లు-లేనివాళ్లు అనే అంతరం తొలగిపోవాలన్న స్వప్నం 2047 నాటికి సాకారమవుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పటికి స్వతంత్ర భారతావనికి 100 ఏళ్లు నిండుతాయని వివరించారు. భారతదేశం 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునే నాటికి ఆర్థిక అసమానతలు లేని సమాజంగా తీర్చిదిద్దేలా పార్లమెంట్ లో నిర్ణయాలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.