ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి,,,డబ్ల్యూహెచ్ఓ

international |  Suryaa Desk  | Published : Sat, May 27, 2023, 08:01 PM

ప్రపంచంపై మరో మహమ్మరి దాడిచేయనున్నదా అంటే ,డబ్ల్యూహెచ్ఓ అవుననే అంటోంది.  కోవిడ్-19 ప్రపంచం ముందు అపూర్వమైన సవాళ్లను విసిరింది. వేలాది మంది మరణాలకు కారణమైంది. 2019లో వెలుగుచూసినప్పటి నుంచి త్వరగా వ్యాపించే ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించడానికి శాస్త్రవేత్తలు రేయింబవళ్లూ శ్రమించారు. టీకాలు అందుబాటులోకి రావడంతో మూడేళ్ల తర్వాత ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. కానీ, శాస్త్రవేత్తలు మరో మహమ్మారి వ్యాప్తి గురించి అప్రమత్తంగా ఉన్నారు. ప్రత్యేకించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ రెండు రోజుల కిందట తదుపరి మహమ్మారికి ప్రపంచం సిద్ధంగా ఉండాలన్న ప్రకటన కలవరానికి గురిచేస్తోంది. రాబోయే మహమ్మారి కోవిడ్ -19 కంటే చాలా ఘోరమైనది కావచ్చని ఆయన హెచ్చరించారు.


ఈ హెచ్చరిక తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో ‘ప్రాధాన్యత వ్యాధి’ జాబితాపై మళ్లీ ఆసక్తి నెలకొంది. ఈ జాబితాలో తదుపరి ప్రాణాంతక మహమ్మారికి కారణమయ్యే వ్యాధి పేర్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకూ మనకు తెలిసి ఎబోలా, సార్స్, జికా వంటి పేర్లు ఉన్నా.. ‘డిసీజ్ ఎక్స్’ పేరుతో కొత్త దానిని చేర్చడం ఆందోళన కలిగిస్తోంది.


డబ్ల్యూహెచ్ఓ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పదం ‘ప్రస్తుతం మానవ వ్యాధికి కారణమయ్యే వ్యాధికారక తీవ్రమైన అంతర్జాతీయ అంటువ్యాధి సంభవించవచ్చు అనే సంకేతాన్ని సూచిస్తుంది’. ఇది వైరస్, బాక్టీరియం లేదా ఫంగస్ ఎటువంటి తెలిసిన చికిత్సలు లేనిది కావచ్చు. డబ్ల్యూహెచ్ఓ 2018లో ఈ పదాన్ని ఉపయోగించడం ప్రారంభించింది. ఏడాది తర్వాత కోవిడ్-19 ప్రపంచంపై విరుచుకుపడటం ప్రారంభించింది.


బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ ఇంటర్నేషనల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పరిశోధకుడు ప్రణబ్ ఛటర్జీ నేషనల్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. డిసీజ్ ఎక్స్ ఈవెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం అతిశయోక్తి కాదని అన్నారు. ‘కాంబోడియాలో ఇటీవల హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ కేసులు ఒక ఉదాహరణ మాత్రమే’ అని తెలిపారు.


ఈ పదం ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. చాలా మంది నిపుణులు తదుపరి వ్యాధి ఎక్స్ ఎబోలా, కోవిడ్-19 వంటి జూనోటిక్ అని పేర్కొన్నారు. మరికొందరు వ్యాధికారకాలను మనుషులు కూడా సృష్టించవచ్చని చెప్పారు. ‘ఇంజినీరింగ్ మహమ్మారి వ్యాధికారక సంభావ్యతను కూడా విస్మరించలేం’ అని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ హాస్పిటల్ ఎపిడెమియాలజీ జర్నల్‌లో 2021 కథనం అధ్యయనవేత్తలు చెప్పారు.


ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలోని ఇతర ప్రాధాన్య వ్యాధులలో మార్బర్గ్ వైరస్, క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్, లస్సా ఫీవర్, నిపా, హెనిపావైరల్ వ్యాధులు, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఉన్నాయి. కొత్త మహమ్మారిపై ప్రస్తుతానికి పర్యవేక్షణ పెంచాలని, నివారించే చర్యలను అభివృద్ధి చేయడానికి అదనపు నిధులు అందించాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com