ఉక్రెయిన్ నగరాలను స్వాధీనం చేసుకోడానికి రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. అయితే, మాస్కో సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ .. రష్యా దాడులను అంతేస్థాయిలో తిప్పికొడుతోంది. ఈ క్రమంలో దాదాపు 9 నెలలుగా బఖ్‌ముత్ నగరంలో భీకర పోరు కొనసాగింది. ఈ పోరులో తమ సైనికులు 20 వేల మంది చనిపోయినట్టు ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధిపతి వెల్లడించారు. అంతేకాదు, ఉక్రెయిన్‌తో యుద్ధానికి నియమించుకున్న మొత్తం 50 వేల మంది రష్యన్ ఖైదీలలో సగం మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
అయితే, రష్యా మాత్రం ఉక్రెయిన్ యుద్దంలో తమ సైనికులు ఇప్పటి వరకూ కేవలం 6 వేల మంది మాత్రమే చనిపోయారని ఈ ఏడాది జనవరిలో ప్రకటించడం గమనార్హం. రష్యా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ మాట్లాడుతూ... ‘ఉక్రెయిన్ నిస్సైనికీకరణ లక్ష్యంతో రష్యా చేపట్టిన సైనిక చర్యను ఉక్రెయిన్ దళాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. పాశ్చాత్య దేశాలు అందిస్తోన్న ఆయుధ సహాయం, సైనిక శిక్షణతో ఉక్రెయిన్ సైన్యం బలంగా మారింది’ అని తెలిపారు. యుద్ధం సమయంలో ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, పాశ్చాత్య దేశాల మద్దతుతో దూసుకెళ్తున్న ఉక్రెయిన్ సైన్యం ప్రతిదాడులకు సిద్ధమవుతోందని చెప్పారు. ఉక్రెయిన్ ప్రతిదాడులు మొదలైతే మాత్రం దక్షిణ, తూర్పు ఉక్రెయిన్‌తోపాటు ఇప్పటికే ఆక్రమించుకున్న క్రిమియా నుంచి కూడా రష్యా దళాలు వెనక్కి వెళ్లిపోక తప్పదని యెవ్‌గెనీ అంచనా వేశారు.
ఉక్రెయిన్‌లో ఎదురవుతున్న సవాళ్లపై వాగ్నర్ సైన్యం ఎప్పటికప్పుడు బహిరంగంగా తన అసంతృప్తి వెళ్లగక్కుతోంది. ముఖ్యంగా పోరాటానికి అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రష్యా సైన్యం తమకు అందజేయకపోవడం వల్ల ఎంతో మందిని కోల్పోవాల్సి వస్తోందని పలుసార్లు ఆరోపించింది. బఖ్‌ముత్ నగరం పై పట్టు సాధిస్తుండగా ఒకానొక సమయంలో అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తమ సైన్యాన్ని భారీగా కోల్పోయినట్టు వాగ్నర్ గ్రూపు వెల్లడించింది.
మరోవైపు, బఖ్‌ముత్‌లో భారీ స్థాయిలో ప్రతిఘటిస్తున్నామని, అక్కడ ఇంకా పోరాటం ముగిసిపోలేదని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ వెల్లడించారు. రష్యా ఆక్రమిత ప్రాంతాల నుంచి పుతిన్ సేనలను తరిమికొట్టేందుకు ఉక్రెయిన్ సైన్యం ప్రయత్నం చేస్తోందని ఆయన తెలిపారు. అంతేకాదు, పౌరులను కూడా రష్యా సైన్యం చంపుతోందని వాగ్నర్ చీఫ్ ఆరోపించారు. ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనకు సిద్ధమవుతోందని, రష్యా కఠినమైన యుద్ధానికి సన్నద్ధం కావాల్సిందేనని వివరించారు.
ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో కేవలం 6 వేల మంది సైనికులు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని రష్యా చెబుతోంది. 1979-89 మధ్య జరిగిన అఫ్గన్ యుద్ధంలో అప్పటి సోవియట్ సైన్యం 15 వేల మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. అటు ఉక్రెయిన్ కూడా ఎంత మంది సైనికులను కోల్పోయిందనే విషయాన్ని వెల్లడించడం లేదు. కానీ, వాస్తవంగా ఈ సంఖ్య భారీ స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.