ఉజ్జయిని జిల్లాలో ఉరుములు పిడుగులతో కూడిన ఈ భారీ వర్షానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయ ఆవరణలో ఆర్నెల్ల కిందట ప్రతిష్ఠించిన సప్తరుషుల విగ్రహాల్లో ఆరు కూలిపోగా.. వీటిలో రెండు ధ్వంసమయ్యాయి. ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ఒక్కో విగ్రహం పది అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ సమయంలో సందర్శకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
మొత్తం రూ.856 కోట్ల విలువైన మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా గతేడాది అక్టోబరులో మొదటిదశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో సప్తరుషుల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈదురు గాలులకు విగ్రహాలు కూలిపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి కారణంగానే విగ్రహాలు కూలాయని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి విచారణ జరిపించాలని కోరుతూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమలనాథ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, ఈ అంశంపై ఉజ్జయిని జిల్లా కలెక్టర్, డివిజినల్ కమిషనర్‌తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడారు. 50కిపైగా వృక్షాలు కూలిపోగా, అనేక విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మహకాల్ లోక్ కారిడార్‌లోని 155 విగ్రహాల్లో ధ్వంసమైన వాటిని మరమ్మత్తు చేయిస్తామని అధికారులు తెలిపారు. ఉజ్జయిని నగరంలో ఈదురుగాలులకు చెట్టుకూలి ఒకరు, నగడాలో ఇంటిపై కప్పు కూలిపోయి మరొకరు మృతిచెందారు.
‘మహాకాలేశ్వర్ ఆలయ ప్రాంగణంలోని ఆరు విగ్రహాలు కూలిపోయి ధ్వంసమయ్యాయి.. ఐదేళ్లలోపు ఎటువంటి నష్టం జరిగినా వాటిని తయారుచేసిన సంస్థే పూర్తి బాధ్యత వహిస్తుంది.. వీలైనంత త్వరగా ఈ విగ్రహాలను కాంట్రాక్ట్ సంస్థ మార్చుతుంది’ అని ఉజ్జయిని కలెక్టర్ కుమార్ పురుషోత్తమ్ తెలిపారు. ధ్వంసమైన విగ్రహాలను క్రేన్ల సాయంతో అక్కడ నుంచి తొలగించినట్టు వివరించారు. అలాగే, ఎఫ్‌ఆర్‌పీ (ఫైబర్ రీన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్) మెటీరియల్‌తో తయారు చేసిన ఇతర విగ్రహాల ఆడిట్ వీలైనంత త్వరగా నిర్వహించి, ఆరు విగ్రహాలను తొందరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అటు, కాంగ్రెస్ విమర్శలపై అధికార బీజేపీ ఎదురుదాడి చేసింది. దేవుడి విగ్రహాలపై కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ.. తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని దుయ్యబట్టింది. ఇదిలా ఉండగా, జ్యోతిర్లింగ ఆలయం మహకాల్ లోక్ ప్రాజెక్ట్ దేశంలో అతి పొడవైన ఆలయ కారిడార్లలో ఒకటి కావడం విశేషం.