ఉమ్మడి కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేరుతో నగరంలో పలుచోట్ల వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. పెత్తందారులకు పేదల మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ చంద్రబాబు, లోకేష్‌లను పవన్ కళ్యాణ్ పల్లకి మోస్తున్నట్టు ప్లెక్సీలను చిత్రీకరించారు. దీనికి ప్రతిగా ‘‘సామాన్య ప్రజలకు రాక్షస పాలన’’ అంటూ జనసేన నేత కొరియర్ శ్రీను ప్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే కొరియర్ శ్రీను ఏర్పాటు చేసిన ప్లెక్సీని పోలీసులు తొలగించారు. రోజంతా కొరియర్ శ్రీనుని పలు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పి పొద్దుపోయిన తర్వాత పోలీసులు విడుదల చేశారు. ఈరోజు కోనేరుసెంటరులో మరో వివాదాస్పద ప్లెక్సీలను టీడీపీ ఏర్పాటు చేసింది. ‘‘జగనాసుర రక్తచరిత్ర’’ అంటూ ప్లెక్సీ ఏర్పాటు అయ్యాయి. ఈ ప్లెక్సీని కూడా పోలీసులు తొలగించారు. పోలీసుల చర్యలను టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేశారు. టీడీపీ శ్రేణులపై ఆర్ పేట సీఐ రవికుమార్ రెచ్చిపోయాడు. పచ్చిబూతులతో టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. సీఐ రవి కుమార్ చర్యలను టీడీపీ మహిళా నాయకురాళ్లు తీవ్రంగా ఖండించారు. విషయం తెలుసుకుని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ ప్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ను కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. టీడీపీ ప్లెక్సీలను తొలగించమని పోలీసులకు తాను చెప్పలేదని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చెప్పుకొచ్చారు.