టీడీపీ పై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలావుంటే ఇటీవల మహానాడులో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. చంద్రబాబు మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్‌లో పుట్టలేదని, కర్ణాటకలో పుట్టిందని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను టీడీపీ కాపీ కొట్టిందని ఆరోపించారు. అంతేకాకుండా నవరత్న పథకాలైన రైతు భరోసా, అమ్మఒడితో పాటు వైఎస్సార్ తీసుకొచ్చిన పథకాలను కాపీ కొట్టారని అన్నారు. అందరి పథకాలను కాపీ కొట్టి పులిహోర తయారుచేశారని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
'ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పోడిచి మహానాడులో మళ్లీ ఆయన్నే కీర్తించారు. ఆ మహానాడులో మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టో చూస్తుంటే కృష్ణుడిని చంపడానికి వచ్చి పూతన అనే రాక్షసి గుర్తొచ్చింది. అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడు గుర్తొచ్చాడు. సీతమ్మ దగ్గరకు భిక్షగాడి రూపంలో వచ్చిన రావణుడు గుర్తొచ్చాడు. చంద్రబాబు సత్యాన్ని పలకరు, ధర్మానికి కట్టుబడరు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయతలు లేవు. అధికారం కోసం ఎవరినైనా పొడుస్తాడు. మేనిఫెస్టో పేరుతో ప్రజలను వెన్నుపోటు పొడిచే కుట్ర తేరలేపాడు' అని జగన్ విమర్శించారు.
'చంద్రబాబుకు ఒరిజినాల్టీ, పర్సనాల్టీ, క్యారెక్టర్, క్రెడబులిటీ అంతకన్నా లేవు. పోటీ చేయడానికి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేరు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతారు.. ఏ గడ్డైనా తింటారు. చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు.. అధికారం కోసం ఆరాటం పడుతున్నాడు. మనో ఛాన్స్ ఇవ్వండి.. ఏదో చేసేస్తా అంటున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. సీఎంగా మొదటి సంతకానికి క్రెడిబులిటీ ఉంటుంది. కానీ గతంలో రుణమాఫీ అంటూ చంద్రబాబు మొదటి సంతకాన్నే మోసంగా మార్చేశారు' అని జగన్ ఆరోపించారు.
ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్ రైతు భరోసా నిధులను జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందని అన్నారు. రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదని, అందుకే ఈ డబ్బులు ఇస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, పంట నష్టపోయిన రైతులను కూడా ఆదుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు, గజదొంగల ముఠాది అధికారం కోసం ఆరాటమని, దోచుకుని, దాచుకొని నలుగురూ పంచుకోవడానికే వారి పోరాటమన్నారు. రాబోయే రోజుల్లో ఒక యుద్దం జరగబోతోందని, పేదవాడికి, పెద్దందారులకి మధ్య యుద్దం జరుగుతోందన్నారు. చంద్రబాబు డీటీపీ కావాలా? మన డీబీటీ కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని జగన్ సూచించారు.