కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకొన్నాయి. ఈ క్రమంలోనే
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జారి కిందపడ్డారు. వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సందదర్భంగా ప్రొద్దుటూరులో గురువారం వైసీపీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
'సత్యమేవ జయతే.. ఎప్పటికైనా న్యాయం, ధర్మమే గెలుస్తుంది' అని రాసి ఉన్న ప్లకార్టులను వైసీపీ కార్యకర్తలు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలో మార్కెట్ యార్డు నుంచి శివాలయం వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కర్రసాము చేస్తుండగా కిందపడిపోయారు. కర్ర కాలికి తగలడంతో కింద పడినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అక్కడ ఉన్న నేతలు ఆయనను పైకిలేపారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పైకి లేచిన తర్వాత మళ్లీ ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు.
అయితే వైఎస్ వివేకా హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల మూడు రోజులపాటు వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డి తరపు లాయర్‌తో పాటు సునీత తరపు లాయర్, సీబీఐ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వవొద్దని, ఆయన విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టును కోరింది. వివేకా హత్యలో అవినాష్ పాత్ర కీలకంగా ఉందని, ఆయనను కస్టోడియల్ విచారణ చేయాల్సి ఉందని వాదించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని నాలుగు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. నిన్న ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు తుది తీర్పు వెల్లడించింది.
అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించడంతో వైసీపీలో ఆనందం నెలకొంది. కాగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీబీఐ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీబీఐ సవాల్ చేయకపోయినా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదని కొంతమంది చెబుతున్నారు. రేపు, మాపో దీనిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది చూడాలి.