వచ్చే ఎన్నికల్లో పొత్తుతోనే బీజేపీ, జనసేన కూటమి ముందుకు సాగుతుందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానంతో పొత్తులకు సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారని ఆయన వెల్లడించారు. అయితే, పొత్తుల విషయంలో తమ పార్టీ అధిష్టానం ఏం చెబితే అలాగే నడుస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఏపీలో 50 లక్షల కరపత్రాల పంపిణీకి బీజేపీ శ్రీకారం చుట్టింది. వీటిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందలేక పోయింది, కానీ.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందన్నారు. వెనుకబడ్డ ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకే కేంద్రం ఎక్కువ సాయం చేసిందని తెలిపారు. ఈ విషయంలో చర్చకు ఎవరొచ్చినా సిద్ధమని సవాల్ విసిరారు.
ఇక, స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేశారని సుజనా చౌదరి తెలిపారు. తొమ్మిదేళ్లలో నవభారత్ ఆవిష్కృతమైందన్నారు. ఈ విషయాన్ని మోర్గాన్ వంటి పెద్ద పెద్ద సంస్థలే చెబుతున్నాయన్నారు. గతంలో పేద, ధనిక వర్గాల మధ్య భారీ వ్యత్యాసం ఉండేదని.. ఈ 9 ఏళ్లలో పేదలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచారని ప్రశంసించారు. భారతదేశం నుంచి ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేశామని సుజనా చౌదరి గుర్తు చేశారు. జనాభాలో చైనాను మన దేశం మించిపోయిందని, కానీ.. కోవిడ్ సమయంలో చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించారన్నారు.
ఏపీలో విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలను ప్రధాని మోదీ అమలు చేశారని సుజనా చౌదరి తెలిపారు. మోదీ పాలనలో ఏపీలో ఎన్నో విద్యా సంస్థలు, ఎయిమ్స్, జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. అయితే, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల వల్లే పోలవరం ఆలస్యం అయ్యిందని సుజనా చౌదరి ఆరోపించారు.
రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని సుజనా చౌదరి అన్నారు. ప్రధాని మోదీ నిధులు ఇచ్చినా 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రగతిని ఆపేశారని దుయ్యబట్టారు. వెనుకబడ్డ ప్రాంతాలకు కూడా విడతల వారీగా కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు.