టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత విషయంలో స్పీకర్ తమ్మినేని హింసను ప్రేరేపించేలా మాట్లాడడం తగదని మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. ఆయన వ్యాఖ్యలనూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటీవల మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు మద్దతుగా గురువారం విజయనగరం జిల్లాకేంద్రంలో శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం నుంచి ఏఎంసీ కార్యాలయం మీదుగా నర్సిపురం పంచాయతీ సరిహద్దుల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ... రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రి జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు. చంద్రబాబును చూస్తే వైసీపీ నాయకుల్లో వణుకు పుడుతోందన్నారు. మేనిఫెస్టోను చూసి భయాందోళన చెందుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. బలిజిపేట మండలంలో నీటి సమస్యపై ప్రశ్నించిన జనసేన నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో టీడీపీ హయాంలో పేదల గృహ నిర్మాణాలకు రెండు సెంట్లు స్థలం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోలా వెంకటరావు, జి. వెంకటనాయుడు, జి.రవికుమార్, డి.మోహన్, బి.దేవి, చంద్రమౌళి, ప్రదీప్, ఉదయ్‌భాను, భాస్కరరావు, తిరుపతిరావు, గౌరునాయుడు, రవిశంకర్, రాజశేఖర్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.