ఒడిశాలోని బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాద బాధితుల సమాచారం కోసం తెనాలిలో 227600 నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెనాలి స్టేషన్ మాస్టర్ టీవీ రమణ తెలిపారు. బాధితుల సమాచారం కోసం ఈ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. అలాగే హౌరా - యశ్వంతపూర్ రైలులో బాపట్లలో 2, బెజవాడలో 4, చీరాలలో 12 మంది రిజర్వేషన్లు చేయించుకున్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం వచ్చే అనేక రైళ్లు రద్దు అయ్యాయని, పలు రైళ్లను దారి మళ్లించామన్నారు. కాగా రైలు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తమ వారి వివరాల కోసం కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వాళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.