ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన ప్రపంచం

international |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 09:34 PM

యావత్తు ప్రపంచం  ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై స్పందించింది. ఈ ఘటనను విషాదకరమైన సంఘటనగా అభివర్ణించారు. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. అదే విధంగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఒడిశాలో రైలు ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నా.


- కొరోసి, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు


రైలు ప్రమాద ఘటనలో భారీ సంఖ్యలో జరిగిన ప్రాణ నష్టం బాధ కలిగించింది. ఈ దుఃఖ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా.


- పుష్పకమల్‌ దహల్, నేపాల్‌ ప్రధాని


భారత్‌లో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు కలవరపర్చాయి. తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో కెనడియన్లు భారత ప్రజలకు అండగా ఉన్నారు.


- జస్టిన్‌ ట్రూడో, కెనడా ప్రధాని


ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జపాన్ ప్రభుత్వం, జపాన్ ప్రజల తరఫున సంతాపాన్ని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.


- ఫుమియో కిషిదా, జపాన్‌ ప్రధానమంత్రి


ఒడిశా రైలు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను మేం పంచుకుంటాం. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నాం.


- పుతిన్‌, రష్యా అధ్యక్షుడు


భారత్‌లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.


- షెహబాజ్‌ షరీఫ్‌, పాక్‌ ప్రధాని


ఒడిశా రైలు దుర్ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం తైవాన్ ప్రార్థిస్తోంది. బాధితులకు, వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నా.


- సాయ్‌ ఇంగ్‌-వెన్‌, తైవాన్‌ అధ్యక్షురాలు


మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ ఘటనపై ఐరోపా సంతాపం వ్యక్తం చేస్తోంది.


- ఉర్సులా వాన్‌డెర్‌ లెయన్‌, ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు


ఒడిశా విషాద ఘటన దిగ్భ్రాంతికరం. ఉక్రెయిన్ ప్రజల తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.


- జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa