‘మా వీధిలో రోడ్డు వేయించడని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని అడిగితే.. డబ్బులు ఇస్తాను నీవే వేసుకో అని అన్నాడు. కూరగాయలు అమ్ముకునే నా లాంటి పేదరాలు రోడ్డు ఎలా వేయిస్తుంది నాయనా?’ అని సాలమ్మ అనే వృద్ధురాలు జనసేన నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎల్‌ఐసీ కాలనీలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి ‘సేవ్ ధర్మవరం’ కార్యక్రమం పేరిట సోమవారం పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. సాలమ్మ దగ్గరకువెళ్లి.. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. దీంతో రోడ్డు సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్నామని, చాలా మంది వాహనాల్లో వెళ్తూ కింద పడి గాయపడుతున్నారని ఆమె చెప్పారు. సమస్యను ఎమ్మెల్యేకి చెబితే, ‘డబ్బులు ఇస్తాను నీవే రోడ్డువేసుకో’ అని అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎవరో పూలచెట్లు పెట్టారంట. ఆ చెట్లు పోతాయని కాలువ(డైనేజీ) తీయొద్దని చెప్పాడంట. అందుకే రోడ్డు వేయడంలేదు’ అని ఆమె అన్నారు. ‘చెరువులో స్థలాలన్నీ కాజేశాడు. సమస్యలు పరిష్కరించమని అడిగితే పింఛన్ ఇస్తున్నాం కదా అంటున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏ ప్రభుత్వం ఉన్నా పింఛన్ ఇస్తారని, ఆయనేం కొత్తగా ఇవ్వడం లేదు కదా అని చిలకం అన్నారు. ‘కాలనీల్లో ఎందుకు తిరుగుతున్నాడట..? స్థలాలను చూసిపోయేందుకు వస్తున్నాడా..?’ అని చిలకం అనడంతో.. ‘ఇంకెక్కడి స్థలాలు.. అన్నీ కొట్టేశాడు కదా.. కొండపైన కూడా కోట కట్టేశాడు..’ అని ఆమె వైసీపీ ఎమ్మెల్యే అక్రమాలను ఎండగట్టారు. దీంతో జనసేన నాయకులు పగలబడి నవ్వారు. ‘బాధపడకమ్మా.. సమయం దగ్గర పడింది. పంపిద్దాంలే..’ అని చిలకం అనడంతో ‘పంపిస్తే చాలు స్వామి’ అని వృద్ధురాలు వ్యాఖ్యానించారు.