టిడ్కో ఇళ్లను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ నెల 9న గుడివాడకు వెళ్లనున్నారు. అక్కడ నిర్మించిన టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లపై మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించారు. 30 వేల మందికి నీడనిచ్చే కార్యక్రమం గుడివాడలో ప్రారంభం కాబోతోందని జోగి రమేష్ వెల్లడించారు. టీడీపీ హయంలో 1200 ప్లాట్ల నిర్మాణం జరిగితే.. వైసీపీ పాలనలో 9 వేల ప్లాట్ల నిర్మాణం పూర్తి చేశామని కొడాలి నాని వివరించారు. రూ.900 కోట్లతో పూర్తి స్థాయి మౌలిక వసతులతో టిడ్కో లేఔట్ అభివృద్ధి చేశామని చెప్పారు. లబ్ధిదారుల తరపున జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన కొడాలి నాని.. జగన్ పర్యటనలో గుడివాడ ప్రజానీకం భారీ ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జిల్లాలో 27 వేల 872 ఇళ్లు నిర్మిస్తున్నారు. వాటిలో ఒక్క గుడివాడలోనే 8,912 ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్దది. గుడివాడ సమీపంలో 300 ఎకరాల్లో 8 వేల 912 ఇళ్లను నిర్మించారు. నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో కాలనీకి ఆనుకుని 6 వేల 700 వ్యక్తిగత ఇళ్లను కూడా నిర్మిస్తున్నారు.