ఏపీ పోలీసులు ఓ బాల్య వివాహం ఆపేశారు. పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది..‘నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. ఈ పెళ్లిని ఆపండి’ అంటూ అవతలి వైపు నుంచి తన బాధను చెప్పుకున్నారు. వెంటనే వెళ్లిన పోలీసులు పెళ్లిని ఆపేశారు. కామవరపుకోట మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన బాలికకు దగ్గరి బంధువుతో ఈ నెల 8న వివాహం నిశ్చయమైంది. ఆమె వయసు 17 ఏళ్లు మాత్రమే.. బాలికకు ఆ పెళ్లి ఇష్టం లేదు.. ఆమెకు బాగా చదువుకోవాలనే ఆశ ఉంది.
తాను చదువుకుంటానని, ఇంకా మైనర్‌ను అని తనకు పెళ్లి చేయొద్దని ఆమె పెద్దల్ని బతిమాలింది. ఆమె ఎంత చెప్పినా పట్టించుకోకుండా ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి కూడా అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తన బాధను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆదివారం ఉదయం ఆమె మొబైల్‌లో ఉన్న దిశ యాప్ లోని SOSji బటన్ నొక్కి కాల్ చేసింది.. తన సమస్యను చెప్పుకుంది.
తనకు ఈ వివాహం అంటే ఇష్టం లేదని.. తాను బాగా చదువుకోవాలనుకుంటున్నట్లు తన మనసులో మాట చెప్పింది. ఈ సమాచారం అందుకున్న కంట్రోల్ రూము సిబ్బంది వెంటనే తడికలపూడి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆ బాలిక ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి ఆమెకు ధైర్యం చెప్పారు. మైనర్‌కి వివాహం చేయడం నేరమని హెచ్చరిస్తూ ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దిశ పోలీసుల చెప్పడంతో వివాహం ఆగిపోయింది. దిశ SOSకు కాల్ చేయడం ద్వారానే తనకు న్యాయం జరిగిందని బాలిక ఆనందం వ్యక్తం చేసింది.