పల్నాడు జిల్లాలో 21 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న వ్యవహారం ఆలస్యంగా బయటకొచ్చింది. క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 2001లో చనిపోయారు. ఆయన బతికి ఉన్న సమయంలో ఆయన ఎప్పుడూ పింఛను తీసుకోలేదు. అయితే ఆయన చిన్న కుమారుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. తండ్రి పేరుతో పింఛన్ నొక్కేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు.
2011లో తన మామను తండ్రిగా చూపించి పింఛనుకు దరఖాస్తు చేస్తే అధికారులు పింఛన్ మంజూరు చేసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయనకు వృద్ధాప్య పింఛన్‌ను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ క్రమంలో పింఛన్ వ్యవహారం గురించి తెలిసి.. గత నెలలో మృతుడి బంధువులు అధికారులను కలిసి కిరీటి మరణ ధ్రువపత్రం సమర్పించారు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఈ నెలలోనూ అధికారులు రూ.2750 పింఛన్ ఇవ్వడం విశేషం.
ఇలా చనిపోయిన వ్యక్తి పేరు మీద పింఛన్ తీసుకోవడంపై మృతుడి బంధువులు పారా బాబూరావు, పారా జ్యోతి, పారా క్రాంతి జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరణించిన వ్యక్తి పేరుతో 144 నెలలుగా అక్రమంగా పింఛను తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారని గుర్తించారు. అతడు ఇప్పటి వరకు రూ.4 లక్షల మేర పింఛను పొందినట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ఇన్నేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నా అధికారులకు మాత్రం దొరకలేదు.