ఏపికి చెందిన వ్యక్తి తెలంగాణలో తిరుగు పయనంలో రోడ్డు ప్రమాదం జరిగి మరణించాడు. విదేశాలకు వెళ్తున్న కొడుకు, కోడలిని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వదిలిపెట్టాడు. వారికి సెండాఫ్ చెప్పి, తన భార్యతో కలిసి కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో మృతి చెందాడు. థాయిలాండ్‌లో దిగుతూనే తండ్రి మరణవార్త గురించి విన్న కుమారుడు భార్యతో కలిసి వెంటనే వెనక్కి వచ్చేశాడు. నంద్యాల జిల్లా మానవపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా గడివేముల మండలం గని గ్రామానికి చెందిన పరమేశ్వరప్ప (45) వ్యవసాయం చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. పరమేశ్వరప్ప కుమారుడు సాయి తేజప్పకు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అతడికి వివాహం జరిపించాడు. కోడలు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. కొడుకు, కోడలు.. ఇద్దరికీ ఇటీవల థాయిలాండ్‌లో ఉద్యోగం చేసేందుకు అవకాశం వచ్చింది.
ఆదివారం (జూన్ 4) రాత్రి పరమేశ్వరప్ప, భార్య శివలక్ష్మి, కొడుకు, కోడలు కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. కొడుకు, కోడలికి సెండాఫ్ చెప్పి ఇంటికి తిరుగు పయనమయ్యారు. మానవపాడు మండలంలోని బోరవెల్లి స్టేజీ దాటాక డ్రైవర్ వెంకటేశ్ నిద్రమత్తు కారణంగా.. హైవే పక్కన ఉన్న కిలోమీటర్ రాయిని కారు బలంగా ఢీకొట్టి, రహదారి కిందకు దూసుకెళ్లింది. పరమేశ్వరప్ప సీటు బెల్ట్ ధరించకపోవడంతో కారు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య, డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
గాయపడిన ముగ్గురినీ హైవే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. పరమేశ్వరప్ప మార్గమధ్యలోనే మృతి చెందారు. శివలక్ష్మి, డ్రైవర్ వెంకటేశ్ చికిత్స పొందుతున్నారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న సాయి తేజప్ప భార్యతో కలిసి థాయిలాండ్ నుంచి వెనక్కి వచ్చారు. గ్రామంలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో సాయితేజప్ప ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.