ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు ఉండబోవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని కేబినెట్‌లో మంత్రులకు చెప్పారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 9 నెలలే సమయం ఉందన్న సీఎం.. 9 నెలలు కష్టపడితే గెలుపు మళ్లీ తమదేనని వ్యాఖ్యానించారు. ఈ 9 నెలలు కచ్చితంగా ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని వై.ఎస్.జగన్ స్పష్టం చేశారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో.. కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ ఉద్యోగుల కోసం.. సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తెచ్చింది జగన్ సర్కార్.
మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కూడా అంగీకారం తెలిపింది. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ తేదీన అమలుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న సమయానికి కచ్చితంగా అన్నీ కార్యక్రమాలు అమలు చేస్తామని.. ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. మంత్రులకు అప్పగించిన బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించాలని సూచించారు.