ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. తన అమ్మమ్మ అనారోగ్యం తో ఉందని బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో కోర్టు 15 రోజుల పాటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను అప్రూవర్‌గా మారుతానని శరత్ ముందుకు రావడాన్ని ఈడీ కూడా అంగీకరించింది. ఇదిలా ఉంటే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడంపై ప్రత్యేక కోర్టులో సవాల్ చేయాలని ఆప్ భావిస్తోందనే చర్చ జరుగుతోంది. మాగుంట రాఘవరెడ్డిని సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కోర్టు బెయిల్ మంజూర్ చేయడంతో మాగుంట రాఘవ విడుదలకానున్నారు.