ఉద్యోగులకు ఎంత వీలైతే అంత మంచి చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జీపీఎస్ కోసం రెండేళ్లుగా కసరత్తు చేశామని వివరించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు.. వారు బాగుంటేనే ప్రజలు బాగుంటారని.. జగన్ అభిప్రాయపడ్డారు. సీఎం క్యాంపు కార్యాలయంలో.. జగన్‌ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఈ సమావేశం సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై పేర్ని నాని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. సీపీఎస్‌ను రద్దు చేసి జీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. పే కమిషన్ వేసేందుకు గతంలో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు ఏ ఉద్యోగీ రోడ్డెక్కకుండానే 12వ పీఆర్సీని సీఎం జగన్ ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదు' అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.