అంబటి రాంబాబు.. తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు టార్గెట్ చేసిన వైసీపీ నేత. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన అంబటిని ఓడగొడతాం అని.. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. దీంతో ఏపీ ప్రజల ఫోకస్ సత్తెనపల్లి నియోజకవర్గంపై పడింది. వారికి అంబటి రాంబాబు ఎందుకు టార్గెట్ అయ్యారు అనే విషయం పక్కనబెడితే.. ప్రస్తుతం ఆయన సేఫ్ జోన్‌లోకి వెళ్లారనే చర్చ జరుగుతోంది. అందుకు టీడీపీనే కారణమనే టాక్ ఉంది.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున అంబటి రాంబాబు, తెలుగుదేశం పార్టీ నుంచి కోడెల శివప్రసాద్ బరిలోకి దిగారు. ఫ్యాన్ ప్రభంజనంలో స్పీకర్‌గా పనిచేసిన కోడెల ఓడిపోయారు. అంబటి గెలిచి.. ఇటీవల మంత్రి కూడా అయ్యారు. అయితే.. ఎన్నికలు జరిగిన కొన్నాళ్లకు కోడెల శివప్రసాద్ మృతిచెందారు. అప్పటినుంచి సత్తెనపల్లి టీడీపీ బాధ్యతలను కోడెల వారసుడు శివరామ్ భుజాలకెత్తుకున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. తన వర్గాన్ని కాపాడుకున్నారు. వేరే పార్టీలోకి వెళ్లకుండా చూశారు.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. కన్నా లక్ష్మీనారాయణ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. బీజేపీ ఏపీ చీఫ్‌గా పనిచేసిన కన్నా.. ఇటీవల టీడీపీలో చేరారు. తాజాగా.. ఆయన్ను సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్‌గా చంద్రబాబు నియమించారు. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. కోడెల శివప్రసాద్ మృతి తర్వాత.. శివరామ్ సత్తెనపల్లి టికెట్ ఆశించి.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ.. సడెన్‌గా కన్నా ఎంట్రీ ఇవ్వడంతో.. శివరామ్ గుస్సా అవుతున్నారు. పార్టీపై, చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పిలిచి మాట్లాడలేదని.. సత్తెనపల్లికి కన్నా ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారని.. ఆయన వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. దీంతో.. తాను సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని శివరామ్ కూడా ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి.. టీడీపీ టికెట్ ఇవ్వకున్నా పోటీ చేస్తాననే అర్థం వచ్చేలా ఇటీవల వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో కన్నా, కోడెల వర్గం మధ్య కోల్డ్ వార్ నెలకొందనే టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి ఫైట్ మధ్య.. ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సేఫ్ అయ్యారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ తనకు కలిసొస్తుందని మంత్రి అంబటి ధీమా వ్యక్తం చేస్తున్నారు.