తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. CPS రద్దు, 16 శాతం హేచ్ఆర్ఏ ప్రకటించినందుకు.. 12వ పీఆర్సీ ప్రకటన, అనేక అంశాలపై కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు చెప్పారు. సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
'ఏ ముఖ్యమంత్రి కూడా మాకు మంచి చేయలేదు. మీరే మాకు మంచి చేశారు. 12వ పీఆర్‌సీ అడగకుండానే ఇచ్చారు. ఉద్యోగులు గతంలో అసంతృప్తిగా ఉన్నా.. ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారు' అని కాంట్రాక్ట్ నుంచి రెగ్యులరైజ్ అయిన ఉద్యోగి భావోద్వేగానికి గురయ్యారు.
సీఎం వైఎస్ జగన్‌పై ఉద్యోగ సంఘాల నేతల ప్రశంసలు కురిపించారు. 'బటన్ నొక్కడం అనేది దేవుడు మీకు ఇచ్చిన శక్తి సార్. మాట తప్పరు.. మడమ తిప్పరు. అని మీరు నిరూపించారు. మానవత్వానికి నిలువటద్దం సీఎం జగన్. ఓ యుగపురుషుడిలా మీరు వచ్చి మా కుటుంబాలను ఆదుకున్నారు. ప్రజలు పెట్టే దండాలు మావి కాదు సీఎం సార్.. మీవి' అని ఉద్యోగ సంఘాల నేతలు కొనియాడారు.
ఉద్యోగులకు సీఎం జగన్ కూడా భరోసా ఇచ్చారు. 'ఉద్యోగులకు ఎంత వీలైతే అంత మంచి చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. జీపీఎస్ కోసం రెండేళ్లుగా కసరత్తు చేశాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు. మీరు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి' అని ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ అన్నారు.