ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము జమ చేస్తున్నామన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని.. రబీ సీజన్‌లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమన్నారు. ఇందులో రూ.28,402 కోట్లు విలువైన 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.
రూ.28,200 కోట్లను రైతులకు చెల్లించామని.. మిగిలిన సొమ్మును త్వరలోనే జమ చేస్తామని చెప్పారు మంత్రి కారుమూరి. నిండా మునిగిన పౌరసరఫరాల సంస్థ అంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి స్పందించారు. ఇలాంటి కథనాలు రాయటం దారుణమని.. పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం రూ.5 వేలు కోట్లు గ్యారంటీ ఇచ్చిందని ఆ మేరకు అప్పు తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ప్రభుత్వంపై బురద చల్లడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని.. గత టీడీపీ హయాంలో దళారీ వ్యవస్థను ప్రోత్సహించారన్నారు. ఒక ఎకరం ఉన్న రైతు వద్ద కూడా తాము ధాన్యం కొనుగోలు చేశామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాలకి డబ్బు జమ చేశారని.. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాల శాఖలో రూ.20వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. బాబు హయాంలో దళారులు దోచుకున్నారని.. ఎంత తప్పుడు ప్రచారం చేసినా రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నారు.