కెనడా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, రాలీ, కొలంబియా సిన్సినాటి, క్లీవ్‌లాండ్, డెలావేర్, పెన్సిల్వేనియా, సౌత్ కరోలినా వంటి 13 రాష్ట్రాల్లో చోట్ల రెండు రోజులుగా దట్టమైన పొగలు అలముకున్నాయి. చాలాచోట్ల దుమ్ము కమ్మేయడంతో స్కూళ్లలో బయటి కార్యకలాపాలు రద్దు చేశారు. న్యూయార్క్ నగరంలో గురువారం వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలో 500 ఏక్యూఐ నమోదైంది. 1999లో గాలి నాణ్యత రికార్డు చేసిన తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి.
ఏక్యూఐ 300 దాటితే ప్రమాదకరంగా పరిగణిస్తారు. దీంతో అమెరికా వాతావరణ శాఖ అనేక రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని సూచించింది. బైడెన్ సైతం ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ప్రమాదకర వాయుకాలుష్యాన్ని ఎదుర్కొంటున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నవారు అధికారుల మాట విని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఫిలడెల్ఫియాలో మేజర్ లీగ్ బేస్‌బాల్ టోర్నీని వాయిదా వేశారు.
వేసవి ప్రారంభం నుంచి మొదలైన కార్చిచ్చుకు కెనడాలోని దాదాపు 500 చోట్ల అడవుల్లో మంటలు కమ్ముకున్నాయి. కెనడా అడవుల్లో కార్చిచ్చు సర్వసాధారణమే. కానీ, అది పశ్చిమ రాష్ట్రాలకే పరిమితమయ్యేది. ఈసారి మాత్రం తూర్పు ప్రాంతాలైన నోవా స్కాటియా, క్యూబెక్, ఆంటారియోలాకు విస్తరించడంతో కెనడా సతమతమవుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో కార్చిచ్చు రగులుతోంది. వేసవి ఆరంభంలోనే దాదాపు 80 లక్షల ఎకరాలకు విస్తరించాయి. బ్రిటిష్ కొలంబియా, అల్బర్టాలోని 30 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అక్కడ చమురు ఉత్పత్తి కూడా నిలిపివేశారు.
ఒట్టావా, టొరంటో నగరాల్లోనూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. ఒటావాలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగలతో చీకట్లు కమ్ముకున్నాయి. ఇవి గాలిలో ప్రయాణించి పక్కనే ఉన్న అమెరికా రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్చిచ్చును అదుపు చేయడానికి కెనడా పలు దేశాల సాయం కోరుతోంది. ముఖ్యంగా అమెరికావైపు ఆశగా ఎదురుచూస్తోంది. దీంతో 600 మంది అగ్నిమాపక సిబ్బందిని కెనడాకు పంపాలని అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి కూడా త్వరలోనే బృందాలు కెనడాకు వెళ్లనున్నాయి. ఇప్పటికే కెనడాలో 6.7 మిలియన్ ఎకరాల్లో అడవులు మంటలకు ఆహుతయ్యాయి. దీని కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి.