నేడు మన సమాజంలో ఆన్‌లైన్ గేమ్స్ అనేవి జూదం కంటే ప్రమాదకరంగా మారాయి అంటే అతిశయోక్తి లేదు. చిన్న పిల్లలు కూడా ఈ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ వాటినే వ్యసనాలుగా మార్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది. ఓ 13 ఏళ్ల బాలిక ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయింది. ఎప్పుడు చూసినా తల్లి ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేది. వద్దు అని తల్లి వారించినా వినకుండా ఆడుతూనే ఉండేది. చివరికి భవిష్యత్ అవసరాల కోసం దాచిన సొమ్మునంతా ఆన్‌లైన్ గేమ్స్‌లో పోగొట్టింది. రూ. 52 లక్షలను ఆన్‌లైన్ గేమ్స్‌లో పెట్టి ఓడిపోయింది. దీంతో ఆ కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడినవారు ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. హెనాన్ ప్రావిన్సుకు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక పాఠశాలలో ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని కనిపించేది. కొన్ని రోజులు గమనించిన ఆ క్లాస్ టీచర్.. చివరికి ఫోన్ లాక్కుని చూసింది. అందులో మొత్తం ఆన్‌లైన్ గేమ్స్ ఉన్నట్లు గుర్తించింది. రోజు మొత్తం ఆ బాలిక ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నట్లు గమనించింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు టీచర్ చెప్పింది. దీంతో వారు బ్యాంక్ అకౌంట్‌లో చెక్ చేయగా.. అందులో ఉండాల్సిన రూ. 52 లక్షలు ఖాళీ అయ్యాయి. చివరికి రూ. 5 మాత్రమే మిగిలినట్లు చెప్పారు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులయ్యారు.
బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 52 లక్షలను బాలిక ఎలా ఖర్చు చేసిందో ఆమె తల్లి వాంగ్ వెల్లడించింది. బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను చూసి వివరించింది. ఆన్‌లైన్ గేమ్స్‌ను కొనుగోలు చేసేందుకు రూ. 14 లక్షలు ఖర్చు చేసినట్లు గుర్తించారు. మరో రూ. 24 లక్షలను ఆన్‌లైన్ గేమ్స్ కొనుగోలు చేసిన తర్వాత అందులో ఖర్చు పెట్టినట్లు తెలిపారు. వీటితోపాటు మరో రూ. 11.60 లక్షలను తనతో ఉన్న మరో 10 మంది స్నేహితులకు ఆన్‌లైన్ గేమ్స్ కొనిచ్చేందుకు ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఇదంతా నాలుగు నెలల కాలంలో జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొంతమంది తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అంత చిన్న పిల్లకు సెల్ ఫోన్ ఇవ్వడమే తప్పు అని కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును మొత్తం 13 ఏళ్ల బాలిక నాశనం చేసిందని తిడుతున్నారు.