ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే చర్చ జరుగుతోంది. దీంతోపాటు ఇటీవల అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ అయితే టెక్నాలజీ ప్రపంచంలో సంచలన మార్పులు తీసుకువచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భారత టెక్నాలజీలో వచ్చే మార్పులపై ఇరువురూ చర్చించారు.
శామ్ ఆల్ట్‌మన్‌తో సమావేశం అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఈ భేటీ గురించి ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే శరవేగంగా దూసుకుపోతున్న భారత టెక్నాలజీ రంగాన్ని మరింత ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్లడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత దేశ ప్రజల సాధికారత కోసం చేస్తున్న డిజిటల్ మార్పులను మరింత వేగవంతం చేసేందుకు టెక్నాలజీ సంస్థలకు కావాల్సిన అన్ని సహకారాలను ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత శామ్ ఆల్ట్‌మన్ కూడా ట్వీట్ చేశారు. ఈ భేటీ అద్భుతంగా సాగిందని పేర్కొన్నారు. భారత టెక్నాలజీ వరల్డ్‌లో ఉన్న అవకాశాలు, సామర్థ్యాలపై పూర్తి స్థాయిలో మోదీతో చర్చించినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దేశానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్న విషయాలపైనా సమాలోచనలు జరిపినట్లు తెలిపారు. ప్రధాని కార్యాలయంలోని పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులతో జరిగిన అన్ని చర్చలు సఫలం అయ్యాయని వివరించారు.
ఆల్ట్‌మన్ ట్వీట్
ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మొత్తం ఆరు దేశాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నుంచి భారత్ అందిపుచ్చుకునే అవకాశాలపై గురువారం ఢిల్లీ ఐఐఐటీలో సామ్ ఆల్ట్‌మన్ ప్రసంగించారు. ఈ ఆరు దేశాల పర్యటనలో భాగంగా భారత్‌తోపాటు ఇజ్రాయెల్, జోర్డాన్, ఖతార్, యూఏఈ, దక్షిణ కొరియాల్లో ఆల్ట్‌మన్ పర్యటించనున్నారు.