అత్యాచారానికి గురైన మైనర్ బాలిక గర్బం దాల్చగా.. అబార్షన్‌కు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుస్మృతి ప్రకారం చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, 17 ఏళ్లు రాకముందే పిల్లల్ని కనడం ఒకప్పుడు సహజమేనని జస్టిస్ సమీర్ దవే వ్యాఖ్యానించారు. బాధితురాలు, ఆమె కడుపులోని పిండం ఆరోగ్యంగా ఉంటే.. అబార్షన్కు తాను అనుమతించనని స్పష్టం చేశారు. అత్యాచార బాధితురాలి వయసు 16 ఏళ్ల 11 నెలలు కాగా.. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భంతో ఉంది.
అయితే, గర్భం దాల్చి 24 వారాలు దాటిన నేపథ్యంలో అబార్షన్కు న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో బాధితురాలి తండ్రి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించి... అబార్షన్‌కు అనుమతించాలని కోరారు. పిటిషన్‌ను ముందస్తు విచారణకు స్వీకరించాలని బాధితురాలి తరఫున న్యాయవాది.. కోర్టును అభ్యర్థించారు. చిన్న వయసు కావడంతో బాధితురాలి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని విన్నవించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సమీర్ దవే.. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం కాబట్టే ఈ ఆందోళనంతా అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మనుస్మృతిని ప్రస్తావిస్తూ... ‘కావాలంటే మీ అమ్మ.. అమ్మమ్మను అడగండి.. అప్పట్లో వివాహానికి గరిష్ఠ వయసు 14, 15 ఏళ్లే.. 17 ఏళ్లు రాక మునుపే తన తొలి బిడ్డకు జన్మనిచ్చేవారు.. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందుగానే పెద్దవారు అవుతారు.. మీరు మనుస్మృతి చదవలేదేమో.. ఓసారి చదవండి’ జస్టిస్ దవే అన్నారు.
వైద్య నివేదికల ప్రకారం బాలిక ప్రసవం ఆగస్టు 16 అని అంచనా వేశాయని, ఆమెకు, పిండానికి ఎలాంటి సమస్య లేకపోతే అబార్షన్ ఉత్తర్వులు జారీ చేయడం కష్టమని తెల్చిచెప్పారు. అనంతరం వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తి సాధ్యమవుతుందా? లేదా? పరీక్షించాలని రాజ్కోట్ సివిల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేశారు. బాలిక శారీరక, మానసిక పరిస్థితి గురించి అంచనాకు రావాలని వైద్యులకు సూచించారు. జూన్ 15 నాటికి ఇందుకు సంబంధించిన నివేదిక అందజేయాలని, అదే రోజు తదుపరి విచారణ చేపడతామని తెలిపారు.
అలాగే, అబార్షన్‌కు కోర్టు నుంచి అనుమతి రాకపోతే తదుపరి పరిణామాలపై దృష్టిసారించాలని బాలిక తరఫున న్యాయవాదికి సూచించారు. ‘బాలిక, ఆమె కడుపులో పెరుగుతున్న పిండం ఆరోగ్యంగా ఉంటే గర్భవిచ్ఛిత్తికి నేను అనుమతించను.. పిండం బరువు కూడా బాగానే ఉంది. ప్రసవం తర్వాత శిశువు ప్రాణాలతో ఉంటే? ఆ చిన్నారిని ఎవరు సంరక్షిస్తారు? అలాంటి శిశువులకు ఏవైనా ప్రభుత్వ పథకాలు ఉన్నాయా? అనే అంశాలను నేనూ పరిశీలిస్తా? శిశువును దత్తత తీసుకునేవారు ఎవరైనా ఉంటే వారిని మీరు గుర్తించండి’ అని జస్టిస్ సమీర్ దవే అన్నారు.