ముంబయి నగర శివారులోని మీరా రోడ్డులో జరిగిన భయానక హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. సరస్వతి వైద్యను తాను హత్య చేయలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని నిందితుడు మనోజ్ సానీ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ కేసు తన మెడకు చుట్టుకుంటుందనే భయంతోనే మృతదేహాన్ని కనిపించకుండా చేయాలని ప్రయత్నించానని చెప్పాడు. అంతేకాదు, తాను హెచ్‌ఐవీ బాధితుడినని.. చాలా ఏళ్ల కిందటే దాని బారినపడినట్టు తెలిపాడు. అలాగే, సరస్వతితో తనకు లైంగిక సంబంధాలు లేవని, ఆమెను ఓ కూతురిలా చూసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది.
‘సరస్వతి పదో తరగతి పరీక్షలు రాయాలనుకుంది.. ఇందుకోసం నేను ఆమెకు మ్యాథ్‌మెటిక్స్ చెప్పేవాడిని.. అయితే, ఆమె చాలా సంకుచితంగా ఉండేది. నేను బయటకు వెళ్లి ఎప్పుడైనా ఆలస్యంగా ఇంటికి వచ్చినా అనుమానించేది.. అయితే, జూన్ 3న శనివారం నేను ఇంటికి వచ్చే సరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడి కనిపించింది.. సరస్వతి పల్స్‌ను పరిశీలించి పరీక్షించి చనిపోయినట్టు నిర్దారించుకున్నాను.. ఈ కేసులో ఇరుక్కుంటానన్న భయంతో ఆమె మృతదేహాన్ని కనిపించకుండా చేయాలనుకున్నాను.. ఢిల్లీ జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన గురించి తెలుసుకుని అదే తరహాలో మృతదేహాన్ని ముక్కలుగా చేశా.. ఆ తర్వాత నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’ అని విచారణలో నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక విచారణలో మనోజ్ సానేకు హెచ్ఐవీ ఉన్నట్టు 2008లో బయటపడిందని, అప్పటి నుంచి అతడు మందులు వాడుతున్నట్టు తేలింది. కొన్నేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో గాయపడినప్పుడు ఎక్కించిన రక్తం ద్వారా తనకు హెచ్ఐవీ సోకినట్టు అతడు అనుమానిస్తున్నాడు. అయితే, నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఐటీఐలో శిక్షణ పొందిన మనోజ్ సరైన ఉద్యోగం దొరక్క గత 10 ఏళ్లుగా రేషన్ షాపులో పనిచేస్తున్నాడు.
అక్కడే సరస్వతికి అతడితో పరిచయం ఏర్పడింది. 2014 నుంచి వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. 2016 నుంచి ఇద్దరూ ఒకేచోట ఉండటం ప్రారంభించారు. మూడేళ్ల క్రితం మీరా రోడ్ అపార్ట్మెంట్కు మారారు. ఇద్దరి మధ్య పెద్దగా గొడవలేమీ జరిగేవి కాదని పొరుగింటివారు చెబుతున్నారు. ఏం జరిగినా వారిద్దరి మధ్యే ఉండేదని అంటున్నారు.