రాహుల్ తమ పూర్వీకుల నుండైనా నేర్చుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. తన విదేశీ పర్యటనల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత అంతర్గత రాజకీయాలను ప్రస్తావించడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తమ పూర్వీకుల నుండైనా నేర్చుకోవాలని సూచించారు. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అమిత్ షా మండిపడ్డారు. భారత్ లో వేసవి తాపాన్ని తప్పించుకునేందుకు రాహుల్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని, అలా వెళ్లిన ప్రతిసారి దేశంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశీ గడ్డపై సొంత దేశాన్ని విమర్శించడం ఏ నాయకుడికీ తగదని అన్నారు. రాహుల్ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ లో అనేక మార్పులు వచ్చాయన్నారు. అయినా కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు. సెంగోల్ ప్రతిష్ఠాపనను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కానీ దీనిని తొలి ప్రధాని నెహ్రూ ప్రతిష్ఠించాల్సిందన్నారు. ఆయన చేయని పనిని మోదీ చేశారని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడం, డిజిటలైజేషన్, సంక్షేమ పథకాలు, కరోనా వ్యాక్సినేషన్.. ఇలా ఈ విజయాలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. మన్మోహన్, మోదీ పాలనను సరిపోల్చుకోవాలని సూచించారు.