విమానాల్లో ఇటీవల నెలకొన్న పరిస్థితులు.. ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రయాణికుల తప్పు ఉండగా.. మరికొన్ని ఎయిర్ లైన్స్ తరఫున ఉన్నాయి. తాజాగా జపాన్‌లో ఘోర ప్రమాదం నుంచి రెండు విమానాలు తృటిలో తప్పించుకున్నాయి. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న రన్ వే పైకి రెండు విమానాలు రావడంతో అవి ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకున్నాయి. అయితే ఈ ఘటనలో పెద్ద ప్రమాదమేమీ జరగక పోవడంతో రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికులతో పాటు విమానయాన సంస్థలు, అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జపాన్ రాజధాని టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. అక్కడి సమయం ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. హనేడా విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు బయల్దేరిన థాయ్ ఎయిర్‌వేస్ ఇంటర్నేషనల్ విమానం.. తైపీకి బయల్దేరిన ఇవా ఎయిర్‌వేస్ విమానం రన్‌వేపైకి ఒకేసారి వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక విమానాన్ని మరొకటి ఢీకొట్టుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్లు రెండు విమానాలను ఆపేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థలు వెల్లడించాయి. అయితే ఓ విమానం రెక్క స్వల్పంగా దెబ్బతిని.. దానికి సంబంధించిన కొన్ని భాగాలు రన్‌వేపై పడ్డాయి.
అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒకేసారి రన్‌వేపైకి రెండు విమానాలను ఎలా అనుమతించారన్నదానిపై స్పష్టత కరవైంది. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థలు కానీ.. ఎయిర్‌పోర్టు అధికారులు కానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే హనేడా ఎయిర్‌పోర్టులో నాలుగు రన్ వేలు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో మరి కొన్ని విమానాల రాకపోకలకు ఆలస్యం అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఒకే రన్‌వేపై రెండు విమానాలు ఉంచిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి.