మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న సాత్పురా భవన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది భారీ ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ వైమానిక దళ సహాయాన్ని కోరారు. భోపాల్‌లోని సాత్పురా భవన్‌లో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వెంటనే బయటికి పరుగులు తీశారు. భారీగా మంటలు ఎగిసిపడి ఉన్న మిగతా అంతస్తులకు వ్యాపించాయి. దీంతో భవనంలో ఏసీలు, గ్యాస్ సిలిండర్లు కారణంగా పలుసార్లు పేలుళ్లు సంభవించాయి.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైరింజన్లతో ఘటనాస్థలికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు. వారంతా పలు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో వైమానిక దళ సాయం కోరారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి వివరించారు. దీంతో రాజ్‌నాథ్‌సింగ్ వెంటనే వైమానికదళ అధికారులతో మాట్లాడి ఏఎన్-32 విమానం, ఎంఐ-15 హెలికాప్టర్ ఏర్పాటు చేశారు.
మరోవైపు, ఈ ఘటనపై ప్రధాని మోదీతోనూ శివ్‌రాజ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. ఆపరేషన్‌ను ఆయన పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్యాలయాలు ఉండటంతో అందులోని ఫైళ్లు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ అధికారులను ఆదేశించారు. హోం శాఖ అడిషినల్ చీఫ్ సెక్రెటరీ, పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, అగ్నిమాపక శాఖ ఏడీజీలతో కూడిన కమిటీని వేశారు. ఈ బహుళ అంతస్తుల భవనంలో గిరిజన సంక్షేమ, రవాణా, ఆరోగ్య శాఖల కార్యాలయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, లోపలి ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.