పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 600 కిలోల మామిడి పండ్లను కానుకగా పంపినట్టు అధికారులు తెలిపారు. దౌత్య ప్రయత్నాల్లో భాగంగా బంగ్లా ప్రధాని మామిడి పండ్లను పంపారని, ఇందులో ‘హిమ్‌సాగర్, లాంగ్రా’ వంటి రకాలు ఉన్నాయని, గతేడాది కూడా ఇలాగే పంపారని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ తెలిపింది. మమతా బెనర్జీతో పాటు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బంగ్లా ప్రధాని మామిడి పండ్లను పంపినట్టు చెప్పారు.
గతేడాది ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పశ్చిమ్ బెంగాల్, త్రిపుర, అసోం ముఖ్యమంత్రులకు కూడా షేక్ హసీనా మామిడి పండ్లను గిఫ్ట్‌గా పంపారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలున్నాయి. ఒకప్పుడు పాకిస్థాన్ పాలనలో ఉన్న బంగ్లాదేశ్.. ప్రత్యేక దేశంగా అవతరించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. భారత్ సైన్యం ధాటికి పాకిస్థాన్ తలొంచి, తూర్పు పాకిస్థాన్ నుంచి వైదొలగింది. దీంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.