అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుఫాను.. గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని కచ్ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకనున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలలు ధాటికి ఓ వంతెన మునిగిపోయింది. ఈ నేపథ్యంలో గుజరాత్ తీరంలోని కచ్, పోర్‌బందర్, దేవభూమి ద్వారక, జాంనగర్, జునాగఢ్, మోర్బి జిల్లాల్లో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కచ్ తీరానికి ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీర ప్రాంతానికి సమీపంలో ఉన్నవారిని శిబిరాలకు తరలిస్తున్నారు. కచ్, ద్వారకలోని 12,000 మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. జూన్ 16న చేపల వేటను నిషేధించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు దళాలతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. సౌరాష్ట్ర, కచ్‌లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కచ్ జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌ను విధించారు. 15వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
ఆర్థిక రాజధాని ముంబయికీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఐఎండీ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలుల కారణంగా ముంబయి ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. కొన్ని విమానాలను రద్దు చేయగా.. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరి కొన్నింటిని దారి మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాను కారణంగా పశ్చిమ రైల్వే పరిధిలోని 50కిపైగా రైళ్లను రద్దు చేసింది. రాజ్‌కోట్- ఓకా, వీరావల్, మోర్బీ మధ్య నడిచే రైళ్లను మూడు రోజుల పాటు రద్దుచేసినట్టు రైల్వే ప్రకటించింది. తుఫాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.