వైసీపీ నాయకులు చేసే తప్పుల గురించి చదివి చదివి అలుపోచ్చిందని.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వాళ్లు అన్ని తప్పులు చేశారని ఆరోపించారు. కత్తిపూడిలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ గెలిచాక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే.. ఆయనకు ఫోన్లో చాలా మనస్పూర్తిగా అభినందనలు చెప్పి.. మీ వ్యక్తిగత జీవితం, విషయాల గురించి మాట్లాడను.. మంచి పరిపాలన ఇవ్వండి అని చెప్పానని వివరించారు. కానీ.. తన ఇంట్లొ ఉన్న 4 ఏళ్ల బిడ్డను కూడా వదలకుండా తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచ్ఛం, నీచం లేకుండా తిట్టారని.. అంత తప్పు ఏమి చేశాను? ప్రజల కోసం పనిచేయడం తప్పా? అని పవన్ ప్రశ్నించారు.
'నా బిడ్డల కోసం దాచిన సొమ్ముతో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాను. మీరు నా బిడ్డలు అనుకుని, మీ భవిష్యత్తు కోసం.. నా బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టాను. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలన్నీ మంగళగిరి నుంచి సాగుతాయి. వచ్చే ఎన్నికల్లో ఒక్కడిగా పోటీ చేయండి అంటున్నారు.. ఒక్కడిగా వస్తానా, కూటమిగా వస్తానా.. ఇంకా నిర్ణయించుకోలేదు. కచ్చితంగా నిర్ణయం తీసుకున్న రోజు కుండబద్దలు కొట్టినట్టు చెప్పి ఎన్నికలకు వెళ్తాము. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని వ్యూహాలైనా వేస్తాను.. ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిస్తాను. ముఖ్యమంత్రి పదవి కోసం ఎలా పనిచేయాలి అనే దానిపై దృష్టి పెడదాం' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
'18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు తెచ్చుకున్న యువతకు ఒక్కటే విన్నపం.. ఒక మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష, ఆత్మ బలిదానం వలన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది మనం గుర్తు ఉంచుకుని, ఆయన ఆశయాల కోసం పనిచేయాలి. నేను కేవలం సంపాదన కోసం సినిమాలు చేయడం లేదు. పార్టీని నడపడానికి డబ్బు అవసరం కాబట్టి సినిమాలు చేస్తున్నాను. సినిమా టిక్కెట్లు విషయంలో కూడా దిగజారిన వ్యక్తి జగన్. ఆదాయ వనరులను దెబ్బ కొట్టాలి.. పార్టీకి ఆర్థిక సహకారం లేకుండా చేయాలని ప్రయత్నించిన వ్యక్తి జగన్' అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
'దశాబ్దాలుగా ఉన్న పార్టీలు కూడా నాయకులకు భయపడితే.. మనం చెప్పు తీసి చూపించాం. అది మన బలం. ముఖ్యమంత్రి జగన్‌కు చెప్తున్నాను.. ఛాలెంజ్ చేస్తున్నాను.. మీరు నన్ను ఎలా ఆపుతారో చూస్తాను. మాట్లాడితే జగన్ క్లాస్ వార్ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ మాట్లాడుతున్నారు. క్లాస్ వార్ అంటే పేద, ధనిక మధ్య వ్యత్యాసం. జగన్‌తో పోలిస్తే నేను చాలా తక్కున. ఆయన మీద క్లాస్ వార్ నేను చేయాలి. వేల కోట్లు సంపాదన, మైనింగ్ కాంట్రాక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న వ్యక్తి క్లాస్ వార్ అంటే ఎలా. సంక్షేమ పథకాలు ఉండాలి. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ కౌలు రైతుకు నేను లక్ష రూపాయల ఆర్థిక సాయం నా కష్టార్జితం ఇచ్చాను. ఇది నాకు తెలిసిన సంక్షేమం. ఒక బీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలు చేసి సంపాదించి నేను ఇవ్వగలిగాను. కానీ ముఖ్యమంత్రి సంపద క్రియేట్ చేయకుండా, ప్రజల సొమ్మును బటన్ నొక్కి ఇస్తే అది సంక్షేమం కాదు' అని పవన్ వ్యాఖ్యానించారు.
'పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు అని కుట్రలు చేశారు. భీమవరంలో ఓట్ల జాబితా కంటే 8 వేల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. అవి ఎక్కడ నుండి వచ్చాయి. అందరూ నా మీద కక్ష కట్టి ఓడించారు. ఈసారి నన్ను గెలవకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. ఈ సారి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ బలమైన సంతకం చేస్తుంది. అసెంబ్లీలోకి అడుగుపెట్టి తీరుతాను. 151 సీట్లు ఉన్న పార్టీ ఒక్క సీట్ కూడా లేని జనసేన అంటే ఎందుకు భయపడుతుంది. ఎందుకు అణచి వేయడానికి ప్రయత్నిస్తుంది? అంటే మనం బలం వారికి తెలుసు. వైసీపీకి పోటీ మనమే' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
'ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన చే గువేరా పుట్టిన రోజు. యాదృచ్ఛికంగా ఈ రోజు యాత్ర ప్రారంభించాను. నాకు రాజకీయాలకు స్ఫూర్తినిచ్చిన వారిలో అతను ఒకరు. చే గువేరాలో నాకు నచ్చింది.. కష్టాల్లో ఉన్నవారు తన జాతి, కులం, మతం, దేశం కాకపోయినా సరే.. వారి కోసం పోరాటం చేసి అమరులయ్యారు. నన్ను పాలించేవాడు నాకంటే నిజాయితీపరుడు అయి ఉండాలి. ఒక సామాన్యుడి అవినీతి చేస్తే ఏసీబీ పట్టుకుంటుంది. సీఎం అవినీతి చేస్తే ఎవరు పట్టుకుంటారు?' అని జనసేనాని ప్రశ్నించారు.
'నేను మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 10సంవత్సరాలైనా సరే చెక్కు చెదరని ప్రేమ, అభిమానంతో మీరు నావెంట ఉన్నారు. కర్ణుడికి కవచకుండలాలు లాగా నాకు అండగా ఉన్నారు. గత 2 రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం చేశాం. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా అభివృద్ధి సంపూర్ణంగా జరగాలని యాగం చేసి దిగ్విజయంగా పూర్తి చేసి వారాహి విజయ యాత్ర మొదలు పెట్టాను. ఈ 10 సంవత్సరాలు ఒక పార్టీని స్థాపించి, నడిపించడం అంతా సులువు కాదు. లక్షల కోట్లు ఉన్నా గెలుపు, ఓటములకు అతీతంగా నడపలేము. మీలాంటి వారు అభిమానం, భావజాలాన్ని అర్దం చేసుకుని నడిచే వ్యక్తుల వల్ల నడపగలిగాను' అని పవన్ వ్యాఖ్యానించారు.