భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం క్రూరత్వంతో సమానం, కానీ ఇది ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం క్రిమినల్ చర్యల పరిధిలోకి రాదని కర్ణాటక హైకోర్టు ఇటీవలి ఓ తీర్పులో స్పష్టం చేసింది. ఈ మేరకు 2020లో తన భర్త, అత్తమామలపై ఓ మహిళ దాఖలు చేసిన క్రిమినల్ కేసును రద్దు చేసింది. వరకట్న నిషేధిత చట్టం 1961 ప్రకారం తనతో సహా తల్లిదండ్రులపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను సదరు భర్త కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎం నాగప్రసన్న.. వారిపై ఉన్న క్రిమినల్ చర్యలను రద్దు చేశారు.
పిటిషనర్‌పై ఉన్న ఏకైక ఆరోపణ ఏంటంటే ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్న అతడు.. ‘ప్రేమ ఎప్పుడూ భౌతికంగా పొందడం కాదని, అది ఆత్మ నుంచి ఆత్మగా ఉండాలి’ అని నమ్మినట్టు తమ పరిశీలనలో తేలిందని జస్టిస్ నాగప్రసన్న వ్యాఖ్యానించారు. ‘భార్యతో అతడు శారీరకంగా కలవాలని ఎప్పుడూ అనుకోలేదు.. ఇది నిస్సందేహంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12(1)(ఏ) ప్రకారం క్రూరత్వమే అవుతుంది.. కానీ ఇది సెక్షన్ 498ఏ కింద నిర్వచించిన క్రిమినల్ చర్యల పరిధిలోకి రాదు’ అని స్పష్టం చేశారు.
ఈ జంటకు 2019 డిసెంబరు 18న వివాహం కాగా.. సదరు మహిళ అత్తవారింట్లో కేవలం 28 రోజులు మాత్రమే ఉంది. అనంతరం పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె.. 2020 ఫిబ్రవరి 5న భర్త, అతడి తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలాగే, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12(1)(ఎ) కింద కుటుంబ న్యాయస్థానంలో కేసు కూడా దాఖలు చేసింది. తనతో భర్త శారీరకంగా కలవలేదని తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరింది. దీంతో 2022 నవంబర్ 16న ఫ్యామిలీ కోర్టు వివాహాన్ని రద్దు చేసింది.
కానీ, భర్త, అతడి తల్లిదండ్రులపై క్రిమినల్ కేసును కొనసాగించాలని మాత్రం ఆమె నిర్ణయించుకుంది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, క్రిమినల్ చర్యలను కొనసాగించడానికి అనుమతించలేమని, లేదంటే అది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేసి, న్యాయం జరగకుండా పోతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.