తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్ర శేఖర్‌రాపుపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే, గతంలో ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, ములాయంసింగ్ యాదవ్ వంటివారు కూడా ఇటువంటి ప్రయత్నం చేసి విఫలమయ్యారని పవార్ గుర్తుచేశారు. కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నారని, మరి మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ బాధ్యతలు ఎవరు చూస్తారని ఆయన ప్రశ్నించారు.
‘యూపీ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ములాయం సింగ్ యాదవ్, మాయావతిలు ఇటు వంటి ప్రయత్నాలు చేశారు.. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.. బహుశా కే చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నారు.. అందుకే ఆయన ప్రయత్నిస్తున్నారు’ అని పవార్ వ్యాఖ్యానించారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తాండవం చేస్తున్న తరుణంలో తమ రాష్ట్రంలో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెడుతూ.. టీవీల్లో ప్రకటనలు ఇస్తోందని, వీటన్నింటికీ బీఆర్ఎస్ పార్టీకి డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయని అజిత్ పవార్ నిలదీశారు. బీఆర్‌ఎస్‌లో చేరికల గురించి పెద్దగా పట్టించుకోవాల్సింది ఏమీ లేదని అన్నారు. ఇటు మహావికాస్ అఘాడీ, అటు బీజేపీ-శివసేన కూటముల వల్ల టికెట్లు దక్కవన్న ఉద్దేశంతో కొందరు నేతలు ఆ పార్టీలో చేరవచ్చని పవార్ అభిప్రాయపడ్డారు.
ఇక మహావికాస్ కూటమిపై శివసేన సీనియర్ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవేనని పవార్ చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే కోరుకున్నంత కాలం కూటమి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఇక, ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించిన కేసీఆర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటన హోర్డింగుల విషయమై బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఎకరాకు రూ.10,000, 24 గంటల ఉచిత విద్యుత్తు అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, దురదృష్టవశాత్తూ ఎవరైనా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా, తెలంగాణలో మాదిరిగా వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.