జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖ తో మీ అభిమానులతో బండ బూతులు తిట్టిస్తున్నారన్నారు. తనకు మెసెజ్‌లు పెట్టిస్తున్నారని.. ఆ మెసేజ్‌లకు లొంగిపోనని.. ఈ జన్మకు అది జరగదన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో తప్పా.. రాజకీయాల్లో కాదన్నారు. తనను తిట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్, అభిమానులకు ఏమొచ్చిందన్నారు. తాను పవన్ దగ్గర నౌకరిగా పని చేయడం లేదంటూ ఘాటుగా లేఖ రాశారు.
తాను ఎప్పుడూ పవన్ గురించి పత్రికలలో ఒక స్టేట్‌మెంటు కూడా ఇవ్వలేదని.. కాకినాడ ఎమ్మెల్యేతో పాటు తిట్టడం తప్పో రైటో గ్రహించుకోవాలి అన్నారు. కాని తనను తిట్టినదానికి తాను సమాధానం రాయడంతో ఎక్కడా లేని కోపంతో పవన్ అభిమానుల చేత బండ బూతులతో మెసేజ్‌లు పెట్టిస్తున్నారన్నారు. తనకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా అని ప్రశ్నించారు. తాను పవన్‌కు తొత్తుగా ఉండాలా.. తనకేం సంబంధమని ప్రశ్నించారు. పవన్‌కు డబ్బు ఉంది కాబట్టి అభిమానుల చేత తనను తిట్టిస్తారా అని ప్రశ్నించారు.
తన శరీరంలో చీము, నెత్తురు లేకపోవడం వలన పౌరుషం పూర్తిగా పోయిందని.. తానొక అనాథను, ఒంటరి వాడిని ఏమన్నా పడతాననే గర్వమా అన్నారు. తాను లేఖలో ప్రస్తావిస్తున్న కొన్ని విషయాలకు సమాధానం చెప్పాలో వద్దో పవన్‌కే వదిలేస్తున్నాు అన్నారు. ఇంకా చాలా విషయాలు ఈ లేఖలో రాస్తే మహాభారతం అవుతుందని రాయడం లేదన్నారు.
1988లో వంగవీటి రంగాగారిని హత్య చేసిన తర్వాత ఎంతో మందిని అమాయకులను జైలులో పెట్టిన సంఘటనను గుర్తు చేశారు. ఆ సందర్భంలో జైలులో ఉన్న వారిని ఎప్పుడైనా పవన్ వెళ్ళి చూసారా అని ప్రశ్నించారు. జైలులో ఉన్న వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడం కోసం ఏ రోజైనా పలకరించడానికి వారి గృహాలకు వెళ్లారా అన్నారు. జైలులో ఉన్న వారికి బెయిల్స్ తేవడం కోసం ఎప్పుడైనా లాయర్లతో మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. జైలులో ఉన్న వారి మీద టెర్రరిస్టుల కోసం తయారు చేసిన చట్టంలోని కొన్ని సెక్షన్లు వేసి కేసులు పెట్టిన సంగతి తెలుసా అన్నారు.
1988-89లో 3500 మంది అమాయకులపై పెట్టిన కేసులు తీసివేయమని ఎప్పుడైనా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని కలిసి కోరారా అని ప్రశ్నించారు. 1993-94 లో రావులపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి సభలో కాపులను గొడ్డును బాదినట్లు బాదితే.. ఆ బాధితుల్ని ఏరోజైనా పలకరించారా అని మరో ప్రశ్న సంధించారు. 1993-94 ఉద్యమ సందర్భంగా అప్పట్లో పెట్టిన కేసులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును తీసివేయమని అడిగారా అన్నారు. ఎవరు కోరకుండానే ఆరోజు కాపులపై పెట్టిన కేసులు చంద్రబాబు తీసేసిన సంగతి తెలుసా అని ప్రశ్నించారు.
2016 తుని సభ, తర్వాత పెట్టిన కేసులలో ఉన్న వారిని ఎప్పుడైనా పలకరించారా అని ప్రశ్నించారు ముద్రగడ. అక్రమంగా, అన్యాయంగా పెట్టిన కేసులు తీసివేయమని చంద్రబాబు, వైఎస్ జగన్‌ను ఎప్పుడైనా కోరడం జరిగిందా అన్నారు. కాపు మంత్రుల కోరికపై సీఎం జగన్ 2016 నుంచి పెట్టిన కేసులు తీసివేసిన సంగతి తెలుసా అని ప్రశ్నించారు. తాను రాసిన ఈ సంఘటనలలో ఎవరి పాత్ర ఉందో పవన్‌కు కానీ, వన్‌మేన్ ఆర్మీకి గాని తెలుసా అన్నారు. ఈ కులం కోనం తానేమీ చేయనట్టు, స్వార్థపరుడిని అన్నట్లు కులాన్ని ఉపయోగించుకుంటున్నానని, అమ్మేసానని రకరకాల మాటలు చెప్పడం సినిమా డైలాగులను మరిపించింది అన్నారు.
ఒ గోచీ, మొలత్రాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదని.. దమ్ము, ధైర్యం ఉంటే, పవన్ తిట్టాలన్నారు. గోచీ మొలత్రాడు ఉన్న వారితో సమాధానం చెప్పింగలనని.. పవన్ కళ్యాణ్‌కు కాపుల గురించి మాట్లాదే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఏనాడైనా కాపుల గురించి ఆలోచించిన సందర్భం ఉందా అన్నారు. యువతను భావోద్వేగానికి గురిచేస్తోంది ఎవరో పవన్ ప్రసంగాలలోనే తెలుస్తోందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టిన సమయంలో జరిగిన అల్లర్లలో అమాయకులపై పెట్టిన కేసులకు బెయిల్ రాని పరిస్థితుల్లో ప్రజలు కష్టాల్లో ఉంటే కోనసీమకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బెయిల్ కోసం లాయర్లను ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు.
పవన్ కోసం అందరూ రోడ్డు మీదకు రావాలి.. రోడ్డు మీదకు వచ్చిన వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి చేతనైన సహాయం చేయరా అన్నారు. పవన్ కళ్యాణ్ తనను తిట్టిన తరువాత మాత్రమే స్పందించానని.. ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదన్నారు. పవన్ కోసం వారిని దూరం చేసుకోనన్నారు. ఈ బంధంపై జనసేనాని అభిమానుల చేత తిట్టిస్తున్నారని.. డోంట్ కేర్ తానేమీ బానిసను కాదన్నారు. తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్ పవన్ గురించి తనతో సుమారు 3 గంటలు 2019 ఎన్నికల ముందు మాట్లాడిన సందర్భం తెలిసే ఉంటుంది అన్నారు. పవన్ కోసం అంత తాపత్రయపడిన తోట త్రిమూర్తులను ఓడించమని చెప్పడం కోసం తనకు సమయం చాలా తక్కువగా ఉందన్నారు. ఇక్కడి నుండే పిలుపును ఇస్తున్నాను చిత్తుగా ఓడించమని పవన్ సెలవిచ్చారని.. పవన్ కళ్యాణ్ కోసం ఎంతో తాపత్రయపడిన వారిని ఓడించమనడం అర్ధంకాని విషయం అన్నారు. పవన్ అభిమానులు తనను తిట్టిన తిట్లకు తనలో ఉత్సాహం ఇంకా పెరిగిందని.. అలాగే ఎన్నికల యుద్ధానికి సిద్ధమవ్వాలనే వాతావరణం కనిపించిందన్నారు.