కడపలో నగరంలో పట్టపగలు వైఎస్సార్‌సీపీ నేత హత్య కలకలంరేపింది. స్థానికుడైన శ్రీనివాసులు రెడ్డి ఇవాళ జిమ్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు బుర్ఖా ధరించి వచ్చారు.. శ్రీనివాసులురెడ్డిని కిరాతకంగా కత్తులతో దాడి చేశారు. అతడు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు రెడ్డి మృతి చెందారు.
ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున్ ఆస్పత్రికి చేరుకుని హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. భూతగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ హత్యపై కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్ర నాథ్ రెడ్డి స్పందించారు. వైఎస్సార్‌సీపీ వల్లూరు కార్యకర్త శ్రీనివాసుల రెడ్డి హత్య దారుణమన్నారు. దీని వెనుక ఎంతటి వారైనా ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎంవో అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు చెప్పామని.. ఇటీవల జిల్లాలో నారా లోకేష్ పర్యటన జరిగిందని.. ఎవరికీ ఏమీ చెప్పారో తెలియాలన్నారు. శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్‌సీపీ సిన్సియర్ కార్యకర్త.. అందుకే హత్య చేశారన్నారు. భూ తగాదాలు ఆయనకు ఎవరితో లేవని.. పోలీసులు నిందితులను పట్టుకుంటా మంటున్నారని.. పట్ట పగలు నగరంలో ఇలా జరగడానికి ఖండిస్తున్నామన్నారు.